Peddaambarpeta ghatkesar
-
ఔటర్‌పై ‘టోల్’ మోత
పెద్దఅంబర్‌పేట్-ఘట్కేసర్ మార్గంలో టోల్‌ప్లాజాలు రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం సిటీబ్యూరో: పెద్దఅంబర్‌పేట- ఘట్కేసర్ మార్గంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు టోల్ మోత మోగనుంది. ఈనెల 4వ తేదీ నుంచి టోల్ ట్యాక్స్ వసూళ్లను ప్రారంభిస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. గురువారం అర్థరాత్రి 1గంట నుంచి పెద్దఅంబర్‌పేట- ఘట్కేసర్ మార్గంలో టోల్ ట్యాక్స్ వసూలును అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం ఔటర్‌పై టోల్ వసూలు చేస్తున్న ‘ఈగల్’ సంస్థకే ఈ బాధ్యతను అప్పగించారు. మొత్తం ఔటర్‌పై 2016 జనవరి వరకు టోల్ వసూలు చేసేందుకు ‘ఈగల్’ సంస్థతో హెచ్ఎండీఏ ఇప్పటికే ఒప్పందం చేసుకొంది. గడువు ముగిసేవరకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసుకొనేందుకు బుధవారం తాజాగా అధికారికంగా అనుమతిచ్చింది. ఇందుకుగాను సదరు సంస్థ నెలకు రూ.23 లక్షలు హెచ్ఎండీఏకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో టోల్గేట్ వసూలుకు ఘట్కేసర్, తారామతిపేట్, పెద్దఅంబర్పే జంక్షన్ల వద్ద కొత్తగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చే స్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి ఈ ఇంటర్ ఛేంజెస్ వద్ద టోల్ వసూలు మొదలవుతుంది. అయితే... ప్రధాన రహదారికి ఆనుకొని ఉండే సర్వీసు రోడ్లపై ఎటువంటి పన్ను వసూలు చేయరు. కేవలం మెయిన్ క్యారేజ్ వేపై ప్రయాణానికేఈ పన్నులు వర్తిస్తాయని హెచ్ఎండీఏ ప్రకటించింది. రూ.10 నుంచి ఛార్జీ : ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ వసూలు చేస్తున్న ఛార్జీలను ప్రమాణికంగా తీసుకుని టోల్ ఛార్జీ నిర్ణయించినట్లు ఓఆర్ఆర్ అధికారులు తెలిపారు. ప్రతి కి.మీ.కు కారుకు సుమారు 84పైసలు, లైట్ రవాణా వాహనానికి రూ.1.37పై, మీడియం వెహికల్ (బస్సు, లారీ)కి రూ. 2.87పై, భారీ వాహనాలకు రూ.3.13పై, మెషినరీ వెహికల్(6 చక్రాలు)కు రూ.4.49పై, 7యాక్సిల్ పైన ఉన్న భారీ వాహనాలకు ఒక కి.మీ.రూ.5.48పై ఛార్జీ వసూలు చేస్తారు. అయితే... పన్ను చెల్లింపులో చిల్లర సమస్య రాకుండా కనీస ఛార్జీ రూ.10లుగా నిర్ణయించారు. టెండర్ పిలుస్తాం.. ప్రస్తుతం టోల్ టెండర్ దక్కించుకొన్న ఈగల్ సంస్థతో 2016 జనవరి వరకు ఒప్పందం ఉందని, ఆతర్వాత మళ్లీ టెండర్ పిలిచి అత్యధికంగా కోట్ చేసిన సంస్థకు మొత్తం ఔటర్‌పై టోల్ వసూలు బాధ్యతను అప్పగిస్తామని సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు. ఇటీవలి వరకు ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలో ఉచిత ప్రయాణానికి అనుమతిచ్చామని, అయితే... రోడ్డు నిర్వహణ, ఆధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉన్నందున టోల్ వసూలు అనివార్యమైందన్నారు. టీఎంఎస్ అందుబాటులోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంటంతో అప్పటివరకు మ్యాన్యువల్‌గా టోల్ వసూలు చేస్తామని ఆయన వివరించారు. -
రయ్... రయ్...
పెద్దఅంబర్‌పేట- ఘట్కేసర్ మార్గం ప్రారంభం వరంగల్- విజయవాడ హైవేలతో అనుసంధానం ఉప్పల్, ఎల్బీనగర్లలో తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ సిటీబ్యూరో ఔటర్‌పై వాహనాల పరుగులు మొదలయ్యాయి. కీలకమైన వరంగల్-విజయవాడ జాతీయ రహదారితో ‘లింక్’ కుదిరింది. ఫలితంగా దూరం తగ్గింది. సమయం కలిసి వస్తోంది. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సుమారు 14 కి.మీ. ఔటర్ ప్రధాన రహదారి (మెయిన్ క్యారేజ్ వే)ని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అధికారులు బుధవారం ప్రారంభించారు. 8 లైన్ల ప్రధాన రహదారిపై రయ్... రయ్... మంటూ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలో రాకపోకలకు అనుమతించడంతో వరంగల్ నుంచి విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానమైంది. ఘట్కేసర్ జంక్షన్ వద్ద ఔటర్ పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారికి చేరుకునేందుకు వీలు కలిగింది. ప్రధానంగా వరంగల్- విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబయ్ ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలకు ఈ మార్గంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్, ఎల్బీనగర్ మీదుగా వనస్థలిపురం, హయత్‌నగర్ గుండా ప్రయాణించి పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-9)పైకి చేరుకుంటున్నాయి. ఘట్ కేసర్-పెద్ద అంబర్‌పేట ఔటర్ అందుబాటులోకి రావడంతో వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా శివార్ల నుంచే ప్రధాన రహదారులకు చేరుకునే అవకాశం కలుగుతోంది. వరంగల్ నుంచి వచ్చే వారు శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తక్కువ సమయంలో నేరుగా చేరుకునేందుకు ఈ మార్గం ఉపకరిస్తుంది. ఉచిత ప్రవేశం ఘట్కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ప్రవేశం ఉచితం. ఈ మారంలో వాహనదారుల నుంచి టోల్‌ట్యాక్స్ (దారి సుంకం) వసూలు చేయరాదని హెచ్‌జీసీఎల్ అధికారులు నిర్ణయించారు. కొంతకాలం ఉచితంగా అనుమతించి... ట్రాఫిక్ రద్దీని గమనించాక టోల్‌ట్యాక్స్ వసూలుపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌కు ఇరువైపులా సర్వీసుల రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని జూన్ నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. పెద్దఅంబర్‌పేట-ఘట్కేసర్ 14 కి.మీ. స్ట్రెచ్‌ను రూ.300 కోట్ల వ్యయంతో ఎన్సీసీ సంస్థ నిర్మించింది. నిజానికి 2012 నవంబర్కుఈ మార్గం పూర్తవ్వాల్సి ఉంది. భారీగా రాక్ కటింగ్‌తో పాటు మూసీ నదిపై 200 మీటర్ల మేర 6 స్పాన్లతో బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగినట్లు హెచ్ఎండీఏ చెబుతోంది. త్వరలో పెండింగ్ పనులు పూర్తి మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డుకు గాను ఇప్పటి వరకు 134 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. ఇంకా 24 కి.మీ. రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ఘట్కేసర్- కీసర (10 కి.మీ.) మార్గాన్ని, ఘట్కేసర్ ఆర్వోబీని జూన్కుపూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు. కీసర-శామీర్‌పేట (10.3 కి.మీ.) ప్రధాన మార్గాన్ని ఈ ఏడాది నవంబర్‌కు పూర్తి చేస్తామని చెప్పారు. కండ్లకోయ జంక్షన్ వద్ద భూసేకరణ కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున అక్కడ 1.1 కి.మీ. మేర నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. ప్రస్తుతం 18 జంక్షన్లలో టోల్ అడ్మినిస్ట్రేషన్ భవనాల నిర్మాణం మొదలైందన్నారు. 2016 ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తి చేసి ఔటర్‌పై ఆధునిక టోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు.