చలో..పల్లె‘టూరు’ | People in the village location with holiday Sankranthi trail | Sakshi
Sakshi News home page

చలో..పల్లె‘టూరు’

Published Sat, Jan 10 2015 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

చలో..పల్లె‘టూరు’

చలో..పల్లె‘టూరు’

సంక్రాంతి సెలవులతో నగర వాసుల పల్లెబాట
బస్సులు, రైళ్లలో రద్దీ
తొలి రోజు 500 ప్రత్యేక బస్సులు

 
 ‘పల్లెకు పోదాం... పండగ చేద్దాం’ అంటూ జనం  స్వగ్రామాల వైపు కదులుతున్నారు. పిల్లా పాపలతో
 హుషారుగా పరుగులు తీస్తున్నారు. ఇలా బయలుదేరిన జనాలతో రైల్వే స్టేషన్లు...బస్ స్టేషన్లు...కళకళలాడుతున్నాయి. ఎటొచ్చీ ప్రయాణికుల సంఖ్యకు సరిపడే స్థాయిలో రైళ్లు... బస్సులు లేకపోవడంతో నిరాశకు  గురవుతున్నారు. ఆర్టీసీ ‘ప్రత్యేకం’ పేరుతో టిక్కెట్ చార్జీల్లో 50 శాతం అదనపు దోపిడీకి దిగితే... ప్రైవేటు ఆపరేటర్లు రెట్టింపు స్థాయిలో వసూలు చేసి ఏడాది మొత్తం ఆదాయాన్ని పది రోజుల్లోనే పోగే సే పనిలో పడ్డారు.
 
సిటీబ్యూరో:  సంక్రాంతి సెలవులు వచ్చేశాయి. పండుగ సంబరాలకు నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దీంతో శుక్రవారం జంట నగరాల నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్  బస్సులు రద్దీగా కనిపించాయి. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు 500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, కర్నూలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ , నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లలో   సందడి నెలకొంది. ఈసారి సంక్రాంతి, అయ్యప్ప భక్తుల శబరిమలై దర్శనాన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే సుమారు 130 అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. మరో వైపు నిత్యం హైదరాబాద్ నుంచి ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించే 3,500 బస్సులకు తోడు అదనంగా 5,560 బస్సులను ప్రత్యేకంగా నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. వాటిలో 2835 ప్రత్యేక బస్సులు ఆంధ్ర వైపు, మరో 2720 బస్సులు తెలంగాణ వైపు  నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రెగ్యులర్‌తో పాటు 500 ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. ప్రైవేట్ బస్సులూ కిటకిటలాడుతున్నాయి. మరో రెండు రోజుల్లో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా బస్సులను పెంచుతామని ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు.
 
తప్పని నిరీక్షణ


సంక్రాంతి రద్దీ నేపథ్యంలో అన్ని ప్రధాన రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. గోదావరి, గరీబ్థ్,్ర నర్సాపూర్, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ, ఫలక్‌నుమా, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ బోర్డులు వెలుస్తున్నాయి. ప్రత్యేకరైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 దాటిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 130 ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ వాటిలో ఎక్కువ శాతం శబరికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసినవే. సంక్రాంతికి అందుబాటులోకి తెచ్చిన వాటి సంఖ్య చాలా స్వల్పం. మరోవైపు కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒకటి, రెండు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్‌క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేసినప్పటికీ  ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గ స్థాయిలో లేవు. సాధారణ రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా... సంక్రాంతి సందర్భంగా మరో లక్ష మంది వరకు రైళ్లలో తరలివెళ్లే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు  లేకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించవలసి వస్తోంది.

బస్సుల్లో చార్జీల మోత

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లు చార్జీల మోత మోగిస్తున్నారు. సాధారణం కంటే ఒకటి, రెండు రెట్లు అదనపు చార్జీలు విధించి నిలువుదోపిడీ కి పాల్పడుతున్నారు. మరోవైపు ఏటీబీ ఏజెంట్లు, ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్లు సీట్లను బ్లాక్ చేసి అద నపు వసూళ్లకు దిగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 దారి మళ్లింపు

సంక్రాంతి సందర్భంగా నడుపనున్న ప్రత్యేక బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌కు రావాల్సిన వాటిని నగర శివార్ల నుంచే నడుపుతున్నారు.
     
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్‌ల నుంచి బయలుదేరుతాయి.కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ హేంగర్ (గౌలిగూడ) నుంచి నడుపుతున్నారు. నల్గొండ, మిరియాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, ఎల్‌బీనగర్‌ల నుంచి బయలుదేరుతాయి. వరంగల్, యాదగిరి గుట్ట, హన్మకొండ, జనగామ బస్సులు ఉప్పల్ రింగురోడ్డు నుంచి నడుస్తాయి.  విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర రూట్ల బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి నడుస్తాయి.ఎల్‌బీనగర్, ఉప్పల్ రింగు రోడ్డు వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చే స్తున్నారు.  గౌలిగూడ, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లలో అనౌన్స్‌మెంట్‌తో పాటు, హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement