ప్లాన్ పిటీ | plan city | Sakshi
Sakshi News home page

ప్లాన్ పిటీ

Published Mon, May 30 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

ప్లాన్ పిటీ

ప్లాన్ పిటీ

లక్ష్యం చేరని ‘100 రోజులు’ కార్యాచరణ ప్రణాళిక
వందకు 34 మార్కులే...
26 పనుల్లో 12 మాత్రమే పూర్తిచేసిన జీహెచ్‌ఎంసీ..
జలమండలిలోనూ అంతంతే

 

భాగ్యనగర రూపురేఖలు సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మేడిపండు చందమే అయ్యింది. వంద రోజుల ప్రణాళికకు వంద మార్కులు కేటాయిస్తే..ప్రస్తుత అంచనా మేరకు దక్కింది 34 అత్తెసరు మార్కులే. రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఈ మహా ప్రణాళిక అమలులో జీహెచ్‌ఎంసీ అధికారులు చతికిలపడ్డారు. జలమండలి అధికారులు అప్పటికే ప్రారంభించిన పనులకు వందరోజుల ముసుగు తొడిగి మమ అనిపించేశారు.  చేయగలిగిన పనులు మాత్రమే ప్రణాళికలో పొందుపరచాల్సిందిగా మంత్రి సూచించినప్పటికీ, అత్యుత్సాహంతో 26 పనుల్ని ప్రణాళికలో పొందుపరచి బల్దియా అధికారులు అభాసుపాలయ్యారు. ఇందులో మహా అయితే 12 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో హడావుడి చేసిన మహానగర పాలక సంస్థ సిబ్బంది...కనీసం పబ్లిక్ టాయ్‌లెట్లను వినియోగంలోకి తేలేకపోవడం ఈ ప్రణాళిక అమలులో డొల్లతనం స్పష్టమవుతోంది. ఖాళీ స్థలాలకు ప్రహరీలు, పార్కుల్లో పిల్లల ఆటసామాగ్రి వంటి చిన్నచిన్న పనులను పూర్తిచేయడంలోనూ విఫలమవడం గ్రేటర్ పిటీ. ఇక జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులదీ అదే తీరు. హుస్సేన్‌సాగర్‌లో పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా చేపట్టిన నాలా మళ్లింపు పనులు సహా మరో 11 ముఖ్యమైన పనులకు వందరోజుల ముసుగు తొడిగి.. పని పూర్తయినట్లు సంబురాలు చేసుకోవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ అమలు తీరుపై..   ‘సాక్షి’ ఫోకస్.. 

 

హైదరాబాద్ పట్టణం నగరమై.. నగరం మహానగరమై దాదాపు 125 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కోటిమంది జనాభాతో కిక్కిరిసింది. 150 మంది కార్పొరేటర్లతో ప్రత్యేక పాలకమండలి.. అధికార యంత్రాంగం అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్నారు (అలా అనుకోవాలి). ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశ్రమలకు కేంద్రమైంది. ప్రపంచ నగరిగా విస్తరిస్తోంది. ఇన్ని గొప్ప లక్షణాలున్న భాగ్యనగరం మౌలిక సౌకర్యాల భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. చాలావరకు వందల ఏళ్ల క్రితం నిజాములు ఏర్పాటు చేసిన వసతులే ఉన్నాయి. నగర రూపురేఖలు మార్చాలని ప్రపంచ గొప్ప నగరాల సరసన మనమూ నిలవాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ  మంత్రి కేటీఆర్ ‘వంద రోజుల ప్రణాళిక’కు జీవం పోశారు. దీంతో సిటీ అద్భుతంగా మారిపోతుందని అంతా భావించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆర్భాటంగా పనులు ప్రారంభించారు. తర్వాత ఆరంభ శూరత్వంగా మిగిల్చారు. గతంలో చేపట్టిన పనులకు ‘వంద’ రోజుల ముసుగు వేశారు. ప్రణాళికను ప్రకటించి ‘వంద’రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రకటించిన 26 పనుల అమలు తీరుపై ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, సిటీబ్యూరో

 

వార్డు/ఏరియా కమిటీలు
వార్డు కమిటీల ఎన్నికలకు మార్చి 9న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం మే 28న ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నా జరగలేదు. అధికార పార్టీకి తగినంత మంది సభ్యుల బలమున్నప్పటికీ, కోరం లేని కారణంగా ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా వేశారు. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంతో ఈ కమిటీలకు సంబంధించి పొత్తు కుదరకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు వార్డు కమిటీ సభ్యత్వాలను సైతం అధికార పార్టీ కార్పొరేటర్లు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బేరసారాలు పూర్తి కానందునే కోరం లేకుండా వాయిదా వేసుకున్నారనే విమర్శలూ ఉన్నాయి.

 

ప్రయోజనం లేని పూడికతీత..
వర్షం వస్తే నాలాలు పొంగి పోర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. ఇందుకు వేసవిలోనే నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాకపోవడమని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ. 22.79 కోట్లతో 826 కి.మీ. మేర 317 పనులు చేయాల్సి ఉంది. కానీ 285 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో పూడికను బయటకు తీసి నాలా పక్కనే వేసి వదిలేశారు. దీన్ని డంపింగ్ యార్డుకు తరలించక పోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తిరిగి మళ్లీ నాలాల్లోకే చేరింది. దీంతో చేసిన పనులకూ ప్రయోజనం లేకుండా పోయింది.

 

బీటీ రోడ్లు సగం
ప్రజా రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రోడ్లు బాగుచేయాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇందుకు రూ. 200 కోట్లతో 569 రహదారుల పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ 250  పనులే పూర్తి చేశారు. దీంతో షరా మామాలే.. నాలుగు చినుకులు పడితే రహదారులు కుంటలను తలపించే పరిస్థితి. ఎగుడు దిగుడు ప్రయాణాలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

 

 

శ్మశాన వైరాగ్యం..
ప్రణాళికలో భాగంగా రూ.10 కోట్లతో పది శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని తలపెట్టారు. కానీ ఒక్క శ్మశానవాటికలోనే పని జరిగింది. మిగతా తొమ్మిదింటినీ గాలికి వదిలేశారు. శ్మశానవాటికల్లో సదుపాయాలు మెరుగుపరచి, అంత్యక్రియలకు హాజరైన వారికి పరిసరాలు ప్రశాంతతనిచ్చేలా పచ్చని మైదానాలు.. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యం నీరుగారింది.

 

 
బస్‌బేల అభివృద్ధి తుస్..

నగరంలో బస్టాప్ ఒక చోట ఉంటే, బస్సులు మరోచోట ఆగుతాయి. ప్రయాణికులు ఆగిన బస్సును అందుకోవాలని పరిగెత్తేలోగా అది వెళ్లిపోతుంది. మరో బస్సుకోసం గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితి మార్చేందుకు నిర్ణీత ప్రదేశంలో బస్సులాగే విధంగా.. ప్రయాణికులు సౌకర్యవంతంగా బస్సు ఎక్కేందుకు వీలుగా 50 బస్‌బేలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 3 కోట్ల నిధులు విడుదల చేశారు. వీటిల్లో 20 కూడా పూర్తి చేయలేకపోయారు.

 

ప్రజల ‘అత్యవసర’ పనులు తీర్చుకునేందుకు బహిరంగ ప్రదేశాలను పాడుచేయకుండా చూసేందుకు వందరోజుల్లో వంద ‘పబ్లిక్ టాయిలెట్ల’ను అందుబాటులోకి తెస్తామన్నారు. పనులు ఆలస్యం కాకూడదని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను కూడా కొనుగోలు చేశారు. కానీ, ప్రజలకు సదుపాయం మాత్రం కల్పించలేకపోయారు. టాయిలెట్లయితే ఉన్నాయి. వాటి నిర్వహణ ఎవరికి అప్పగించాలో అర్థంకాక నిరుపయోగంగా వదిలేశారు. నిర్వహణ కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. ప్రకటనల ఏర్పాటు ద్వారా వచ్చే ఆదాయంతో జీహెచ్‌ఎంసీయే నిర్వహించాలని ఒకసారి, ప్రకటనల ఆదాయాన్ని కాంట్రాక్టు సంస్థలే పొందేలా ఎవరు ఎక్కువ కాలం నిర్వహించేందుకు ముందుకు వస్తే వారికి అప్పగించాలని మరో సారి.. కాంట్రాక్టు ఏజెన్సీల డిమాండ్లు అడ్డగోలుగా ఉండటంతో ఎక్కడ ఉన్న టాయిలెట్లను వాటికి సమీపంలోని వ్యాపారులకే నిర్వహణ కివ్వాలని మరోసారి.. రకరకాల ఆలోచనలతోనే వంద రోజులు కరిగిపోయాయి.

 

లక్ష్యం చేరని ఆటో టిప్పర్లు
ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు 2 వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లు వినియోగంలోకి తేవాలని భావించారు. 1790 ఆటోల కొనుగోలు పూర్తయినా, వాటిలో కొన్ని చెత్త సేకరణ పనులు చేయడం లేదు. వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై విచారణ చేసి ఒక సర్కిల్‌వి మరో సర్కిల్‌లో పనిచేస్తున్నాయని, మాయం కాలేదని ప్రకటించారు. సమీపంలో చెత్త రవాణా కేంద్రాలు లేకపోవడంతో, ఎక్కువ దూరంలోని కేంద్రానికి వెళ్లి రావాల్సి ఉండటం వంటి సమస్యలతో నగరంలోని అన్ని ఇళ్లకూ ఈ ఆటోలు వెళ్లడం లేదు.

 

ప్రభావం చూపని ప్రహరీలు
గ్రేటర్‌లో ఖాళీగా ఉన్న 350 ప్రభుత్వ స్థలాలకు రూ. 20 కోట్లతో ప్రహరీలు నిర్మిస్తామన్నారు. ఇందులోనూ 89 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఈస్ట్ జోన్‌లో 93 పనులకు 31 పనులు పూర్తి కాగా, సౌత్‌జోన్‌లో 30కి 10, సెంట్రల్ జోన్‌లో 32 పనులకు 7, వెస్ట్‌జోన్‌లో 87 పనులకు 21, నార్త్ జోన్‌లో 108 పనులకు 20 పనులు మాత్రమే పూర్తయ్యాయి.

 

‘డబ్బాలు’ కొట్టారు..
వంద రోజుల ప్రణాళికకు ముందే చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల చొప్పున మొత్తం 44 లక్షల డబ్బాలను పంచాలని నిర్ణయించారు. ప్రణాళికను ప్రకటించే సమయానికి 14.22 లక్షల డబ్బాలు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. మిగతావి అప్పటికే పంపిణీ చేసేశారు. దీన్ని తెచ్చి ‘ప్లాన్’లో చేర్చారు. అయితే, వంద రోజులైనా ఇంకా పదివేల డబ్బాలను పంపిణీ అలాగే ఉండిపోయింది.

 

చెత్త కేంద్రాల తొలగింపు ఓకే..
బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు 1116 ప్రదేశాలను ‘చెత్త రహితం’గా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయా ప్రదేశాల్లోని చెత్తను తొలగించడమే కాక, అక్కడ తిరిగి చెత్త వేయకుండా అందమైన ముగ్గులు, స్వచ్ఛ భారత్ నినాదాలతో వర్ణ చిత్రాలు వేస్తూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అయినప్పకీ ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో పూర్తి చేయలేకపోయారు. దాదాపు 960 ప్రాంతాల్లో ఈ పనులు చేశారు.

 

‘స్లాటర్ హౌస్’లకు ప్లాన్ ముసుగు
వందరోజుల్లో చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్‌తో పాటు నాలుగు మోడర్న్ స్లాటర్ హౌస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వీటిలో మూడింటికి మున్సిపల్ మంత్రి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. వాస్తవానికి వీటి నిర్మాణ పనులు వంద రోజుల ప్రణాళిక ప్రకటించే నాటికే పూర్తయ్యాయి. కొన్నింటికి గత పాలకమండలిలోనే అప్పటి మేయర్ మాజిద్ సైతం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.

 

బస్కీలు తీస్తున్న జిమ్‌లు
వందరోజుల్లో 150 ప్రాంతాల్లో యువతకు ఉపకరించేలా తగిన సామగ్రితో జిమ్‌లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. కాగా, దాదాపు 50 ప్రాంతాల్లో సివిల్ వర్క్స్ మాత్రం జరిగాయి. మిగతా వాటిల్లో జరగలేదు. సివిల్ వర్క్స్ పూర్తయ్యాక జిమ్ సామగ్రిని అమర్చాల్సి ఉంది. ఇదిలా ఉండగా, 329 క్రీడా ప్రాంగణాల అభివృద్ధి లక్ష్యం కాగా, ప్రాథమిక పనులు మాత్రం జరిగాయి. 

 

మో‘డల్’ మార్కెట్లు..
నగరంలో 40 మోడల్ మార్కెట్లను నిర్మించాలని తలంచారు. ఇందుకు రూ. 26 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడే పూర్తయినట్టు గొప్పలు చెప్పారు. రోజులు గడిచిపోయినా ఐదు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈస్ట్ జోన్‌లో 9, సౌత్‌జోన్‌లో 5, సెంట్రల్ జోన్‌లో 9, వెస్ట్ జోన్‌లో 8, నార్త్‌జోన్‌లో 9 నిర్మాణం జరగాల్సి ఉండగా, ఈస్ట్, వెస్ట్, సౌత్‌జోన్లలో ఒక్కొక్కటి వంతున పూర్తయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement