వాన చుక్క.. ఇంకేదెట్టా!
మహానగరంలో జోరు వానలు కురుస్తున్నా భూగర్భంలోకి చుక్కనీరు చేరడం లేదు. నీరింకే దారిలేక వర్షం నీటిలో దాదాపు 60 శాతం వృథా అవుతోంది. వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు పెరగకపోవడంతో బోరుబావులు బావురుమంటున్నాయి. నగరవాసికి నీటి కొరత ఏమాత్రం తీరడం లేదు. ప్రతి భవంతి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఎవ్వరూ పాటించకపోవడంతో నీరింకే దారి కన్పించడం లేదు. గ్రేటర్‌లో 22 లక్షల భవంతులుంటే, ఇంకుడు గుంతలు లక్షలోపే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి నిర్లిప్తత వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- గ్రేటర్‌లో 22 లక్షల భవంతులకు..ఇంకుడు గుంతలు లక్ష లోపే?
- వర్షపు నీటిలో సుమారు 60 శాతం మేర వృథా
- చోద్యం చూస్తున్న జీహెచ్‌ఎంసీ, జలమండలి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జూన్ తొలి మూడు వారాల్లో సుమారు 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం (82 మి.మీ)కంటే ఇది సుమారు 75 మిల్లీమీటర్లు అధికమే. కానీ ఈనీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో వర్షపునీరు రహదారులను ముంచెత్తి వృథాగా పోయింది.
ఈ దుస్థితితో నగరంలో పలు బోరుబావులు వర్షపు నీటి రీచార్జి లేక బావురుమంటున్నాయి. మహానగరంలో సుమారు 22 లక్షల భవంతులుండగా ..ఇందులో ఇంకుడు గుంతలున్న భవనాలు లక్షకు మించి లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. గడిచిన వేసవిలో జలమండలి సుమారు పదివేల ఇంకుడు గుంతలు తవ్వించాలని లక్ష్యం నిర్దేశించుకోగా అందులో నాలుగు వేలకు మించి తవ్వలేదు. మరోవైపు భవన నిర్మాణ అనుమతులు మంజూరు సమయంలో ఇంకుడు గుంత తవ్వితేనే అనుమతి మంజూరు చేయాల్సిన జీహెచ్‌ఎంసీ ఈ విషయంలో ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండడంతో భూగర్భ జలసిరులు రోజురోజుకూ అడుగంటుతున్నాయి.
ఇంకుడు గుంతలు లేకనే ఈ దుస్థితి..
కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్‌లో ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు(రీచార్జింగ్ పిట్స్)లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో 60 శాతం మేర వర్షపునీరు వృథాగా పోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథాగా పోవడం సిటీజనులు పాలిట శాపంగా మారుతోంది. ఈ నీటిలో సిం హభాగం భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటు చేసేందుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ తవ్వింది ఐదు వేల ఇంకుడు గుంతలే కావడం ఆయా శాఖల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టొచ్చు
- నగరంలో కురుస్తున్న వర్షపునీటిలో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపట్టే అవకాశం ఉంది.
- ఫిలడెల్ఫియా(అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో వర్షపునీటిలో 80 శాతం భూగర్భంలోకి చేరుతోంది.
- ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడెల్పు, రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా, ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్‌సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి.
- ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్‌లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి.
- లోతట్టుప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీచార్జి అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింప జేస్తే రహదారులను మంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది.