ధూంధాంగా | All to prepare for the celebration of the State | Sakshi
Sakshi News home page

ధూంధాంగా

Published Wed, Jun 1 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ధూంధాంగా

ధూంధాంగా

రాష్ట్రావతరణ వేడుకలకు సర్వం సిద్ధం
విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న నగరం
అన్ని శాఖల సమన్వయంతో  ఏర్పాట్లు ముమ్మరం

 

సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలకు గ్రేటర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుల్లతల జిలుగు వెలుగులతో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, కూడళ్లు తళుకులీనుతున్నాయి. అంబరాన్నంటే స్థాయిలో సంబురాల నిర్వహణకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలతోపాటు జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. ప్రధానంగా చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో గురువారం(జూన్ 2న) ఆకాశంలో మిరుమిట్లు గొలిపే రంగురంగుల కాంతులు వెదజల్లే బాణాసంచాతో ఆకాశానికి హరివిల్లులు అద్దేందుకు పర్యాటక శాఖ ‘ఫైర్‌వాల్’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. రాత్రి 8.30 నుంచి 9 గంటల పాటు బాణాసంచా, మతాబుల వెలుగుల్లో సాగర పరిసరాలు కొత్త అందాలు  సంతరించుకోనున్నాయి. చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలు, సంస్కృతికి ఆలవాలమైన భాగ్యనగర సాంస్కృతిక ఔన్నత్యాన్ని దశదిశలా చాటేందుకు కవ్వాలి, గజల్, ముషాయిరా వంటి సాహితీ సమ్మేళనాలను నగర వ్యాప్తంగా ముఖ్యమైన ఆడిటోరియాల్లో ఏర్పాటు చేయనున్నారు. పీపుల్స్‌ప్లాజాలో 500 మంది కళాకారులతో పేరిణీ నృత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా సన్మానిస్తారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించనున్నారు.


హైటెక్‌సిటీలోని హెచ్‌ఐసీసీలో ఎంపికచేసిన ప్రముఖలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. లుంబినీ పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సంజీవయ్యపార్కులో అతిపెద్ద జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ వంటకాలతో ఫుడ్‌ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హోటళ్ల అలంకరణ అత్యున్నతంగా ఉండాలని యాజమాన్యాలకు సూచించారు. అలంకరణ బాగున్న హోటళ్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదుతో సత్కరించనుంది. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహూమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.25 వేల నగదుతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో..

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కోసం జీహెచ్‌ఎంసీ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్‌దీపాలు, పూలతో తీర్చిదిద్దుతోంది.వంద జంక్షన్లలో 2247 ఫ్లడ్ లైట్లు, 530 రంగు రంగుల విద్యద్దీపాలతో పాటు ఆయా ప్రాంతాల్లో 240 హాలోజన్,  1721 పార్‌క్యాన్స్ లైట్లతో నగరాన్ని నయనానందకరంగా అలంకరించనున్నారు. వందరోజులప్రణాళికలో భాగంగా పూర్తిచేసిన  బీటీరోడ్లకు లేన్ మార్కింగ్ , రేడియం స్టడ్‌ల పనులు ముమ్మరం చేశారు. ఎక్కడా చెత్త కనబడకుండా ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ  అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పతాకావిష్కరణలు చేయాల్సిందిగా జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే గన్‌పార్కు, ట్యాంక్‌బండ్, సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్, పరేడ్‌గ్రౌండ్‌లకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 
జలమండలి ..

జలమండలి పరిధిలోని అన్ని సెక్షన్, డివిజన్ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. బోర్డులో సుదీర్ఘ సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించేందుకు ఇంజినీర్స్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది.

 
మైనార్టీ సంక్షేమ శాఖ ....

జూన్ 2న జష్నే తెలంగాణ పేరుతో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాల కోసం పాతబస్తీలోని మక్కామసీదు, సికింద్రాబాద్‌లోని  సీఎస్‌ఐ చర్చి, అమీర్‌పేటలోని  గురుద్వార్‌లలో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు  రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. నాంపల్లిలోని అనీస్-ఉల్-గుర్భా అనాథాశ్రమం లో పండ్లు, మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది.

 

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు..
నగరంలో జరగనున్న పలు కార్యక్రమాల ఏర్పాట్లను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మంగళవారం పరిశీలించారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేయనున్న భారీ జెండాను పరిశీలించారు. దేశం గర్వ పడేలా 303 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. లుంబీనీ పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని, ఇక్కడ తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా హాలు నిర్మిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో నగరం నలుమూలల నుంచి ప్రజలు నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజా, లుంబినీపార్క్‌కు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement