‘మహా’ ఆశ | Large-scale proposals to Budget | Sakshi
Sakshi News home page

‘మహా’ ఆశ

Published Mon, Feb 9 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

‘మహా’ ఆశ

‘మహా’ ఆశ

బడ్జెట్ వైపు ప్రభుత్వ శాఖల చూపు
భారీ ఎత్తున ప్రతిపాదనలు

 
కొత్త రాష్ట్రం... కొత్త బడ్జెట్‌పై  ప్రభుత్వ విభాగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. తమ పరిధిలో  చేపట్టాల్సిన పనులు...అవసరమైన నిధులను ప్రస్తావిస్తూ సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. తాము కోరినంత నిధులు వస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. సర్కారుపై ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.
 
సిటీబ్యూరో: విశ్వ నగరం వైపు అడుగులేస్తున్న గ్రేటర్‌లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు విభాగాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. 2015-16 వార్షిక బడ్జెట్‌పై ‘మహా’ ఆశలు పెట్టుకున్నాయి. అందమైన రహదారులు, పారిశుద్ధ్యం,ప్రజారోగ్య పరిరక్షణ, మురికివాడల్లో కనీస వసతుల కల్పన, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు నేర రహిత రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో శాంతిభద్రతల పటిష్టానికి భారీగా నిధులు అవసరమవుతాయని జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ, వైద్య ఆరోగ్యశాఖ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు విభాగాలు ఆశిస్తున్నాయి. ఈ విభాగాల అంచనాలకు అనుగుణంగా తెలంగాణ  సర్కారు నిధులు విదిలిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

జీహెచ్‌ఎంసీ అంచనాలు రూ.1700 కోట్లు

వచ్చే ఏడాది బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్‌ఎంసీ సుమారు రూ.1700 కోట్లు కోరినట్లు తెలిసింది. 2014-15 బడ్జెట్‌లో రూ.1093 కోట్లు కోరగా... రూ. 373 కోట్లు మాత్రమే సర్కారు కేటాయించింది. ఇది కేవలం నాలుగు నెలలకుసంబంధించినదే. గ్రేటర్‌ను స్లమ్ ఫ్రీ సిటీగా చేస్తామన్న హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి జీహెచ్‌ఎంసీ రూ.50 కోట్లు కోరగా... ప్రభుత్వం ఏకంగా రూ. 250 కోట్లు కేటాయించడం విశేషం. తాజా ప్రతిపాదనల్లో మౌలిక సదుపాయాలకు రూ.200 కోట్లు, కోటి మొక్కల కార్యక్రమానికి రూ.25 కోట్లు, మన వార్డు-మన ప్రణాళికకు రూ.150 కోట్లు కోరినట్లు సమాచారం. రహదారుల అభివృద్ధి, మల్టీలెవెల్‌గ్రేడ్  సెపరేటర్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలకు రూ.500 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. 2013-14లో ప్రణాళిక, ప్రణాళికేతర అంశాలకు రూ. 745 కోట్లు కోరగా.. ప్రభుత్వం రూ. 175 కోట్లే విదిల్చింది.
 
జలమండలికి రూ.1852 కోట్లు

2015-16 ఆర్థిక సంవత్సరానికి జలమండలి రూ.1852 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలతో పాటు శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చే పథకాలు, మూసీ ప్రక్షాళన, సీవరేజి మాస్టర్‌ప్లాన్, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు ఉన్నాయి. ఏటా జలమండలి రూ.వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.600 కోట్లకు మించి  విదల్చడం లేదు. ఈసారైనా నిధుల వరద పారుతుందని జలమండలి వర్గాలు భావిస్తున్నాయి. రూ.1852 కోట్లలో శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలకు రూ.786 కోట్లు, గోదావరి మంచినీటి పథకానికి రూ.573 కోట్లు, కృష్ణా మూడో దశ రుణ వాయిదాలకు రూ.50 కోట్లు అవసరమని పేర్కొన్నారు. మూసీ రెండో దశ ప్రక్షాళనకు రూ.165 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మురికివాడల్లో మంచినీటి వసతులకు రూ.150 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాలనీల్లో మంచినీటికి రూ.92 కోట్లు, నిర్వహణ డివిజన్ల పరిధిలో మంచినీరు, మురుగునీటి పైప్‌లైన్ల మరమ్మతులకు రూ.36 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి.

జంట కమిషనరేట్ల అంచనాలు రూ.1500 కోట్లు

హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల నిఘా, నగదు రహిత చలానాల జారీ, ట్రాఫిక్ విభాగం, సిగ్నల్స్ ఆధునికీకరణ, కూడళ్ల అభివృద్ధి, నేరాల రేటును గణనీయంగా తగ్గించేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు క్లూస్ టీంల బలోపేతం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చోట్ల బారికేడ్లు, జీపీఎస్ సదుపాయం ఉన్న వాహనాలు సమాకూర్చుకునేందుకు రూ.1500 కోట్లు అవసరమవుతాయని జంట కమిషనరేట్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ఇందులో సిబ్బంది జీతభత్యాలు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు కలిపి ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.1000 కోట్లు, సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలకు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు.
 
హెచ్‌ఎండీఏ రూ.2362 కోట్లతో...

2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2362 కోట్లకు పైగా అవసరమని హెచ్‌ఎండీఏ ప్రభుత్వానికి అంచనాలు సమర్పించింది.  ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.760 కోట్లు కేటాయించాలని కోరింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డుకు బీఓటీ యాన్యుటీ కింద కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు రూ.415 కోట్లు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. శివారు ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.300 కోట్లు, చెరువుల సంరక్షణ, అభివృద్ధికి రూ.150 కోట్లు, హడ్కో రుణ వాయిదా చెల్లింపునకు రూ.100 కోట్లు, నగర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.570 కోట్లు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రూ.67 కోట్లు కేటాయించాల్సిందిగా ప్రతిపాదించింది. 2014-15 బడ్జెట్‌లో రెండు విడతల్లో రూ.262 కోట్లు మాత్రమే హెచ్‌ఎండీఏకు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగా... తాజా ప్రతిపాదనల్లో రీజనల్ రింగ్ రోడ్డు, చెరువుల సంరక్షణ, అభివృద్ధి పథకాలు మాత్రవే కొత్తవి. మిగతావన్నీ ఇప్పటికే మంజూరైన పథకాలు కావడం విశేషం.

ప్రజారోగ్యానికి రూ.500 కోట్లు

గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, కోఠి ఈఎన్‌టీ, ఎర్రగడ్డ మానసిక వైద్య శాల, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి, యునాని, ఆయుర్వేద తదితర 109 సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.500 కోట్లు అవసరమని వైద్య ఆరోగ్య శాఖ  ప్రతిపాదనలు పంపింది. ఈ నిధులతో నూతన వైద్య పరికరాలు, పారిశుద్ధ్య సౌకర్యం, ఔషధాల కొనుగోలు, ఇతర మౌలిక వసతుల కల్పన, నూతన భవంతుల నిర్మాణం, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
 
నోట్:జీహెచ్‌ఎంసీ,జలమండలి,హెచ్‌ఎండీఏ కార్యాలయాల ఫోటోలను సింబాలిక్‌గా వాడలరు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement