ఆక్రమణలపై ఉక్కు పాదం | Poaching steel Quarter | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై ఉక్కు పాదం

Published Wed, Mar 18 2015 4:16 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

Poaching steel Quarter

సాక్షి, సిటీబ్యూరో: చెరువులు ఆక్రమణలకు గురికాకుండా ఉక్కు పాదం మోపాలని లేక్ ప్రొటక్షన్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని 2,402 చెరువులకు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) ఖరారు ప్రక్రియను వచ్చే 6 నెలల్లోగా పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది.  నిర్దేశిత గడువులోగా ఈ సర్వే కార్యక్రమాన్ని పూర్తిచేసి నోటిఫై చేయాలని ఆర్వీ కన్సల్టెన్సీకి లక్ష్యంగా నిర్దేశించింది. బీపీపీ కార్యాలయంలో మంగళవారం ‘లేక్ ప్రొటక్షన్ కమిటీ’  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ చెరువుల  ఎఫ్‌టీఎల్ ఖరారు ప్రక్రియలో ఇప్పటివరకు జరిగిన పనులను కమిటీ సమీక్షించింది. ఇప్పటికే ఔటర్ లోపలి వైపు ఉన్న 501 చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌పై రెవెన్యూ సర్వే పూర్తయినందున వాటికి సంబంధించిన నంబర్లను సర్టిఫై చేయాల్సి ఉంది.

అయితే.. ఇప్పటివరకు ఎన్ని చెరువులకు సంబంధించి రెవెన్యూ సర్వే నంబర్లను సర్టిఫై చేశారన్న దానిపై లేక్ ప్రొటక్షన్ కమిటీ ఆరా తీసింది.  ఆయా వివరాలతో కూడిన నివేదికను ఏప్రిల్ 6 నాటికి సిద్ధం చేయాలని కమిటీ లక్ష్యంగా నిర్దేశించింది. ప్రధానంగా ఔటర్ లోపలి వైపు ఉన్న 501 చెరువుల్లో సుమారు 300లకుపైగా చెరువులు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయని, వీటికి సంబంధించిన రెవెన్యూ సర్వే నంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించి సత్వరం సర్టిఫై చేయాలని సంబంధిత శాఖలకు సమావేశం సూచించింది. ముఖ్యంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిధిలో సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ను జలమండలి ఇంతవరకు పూర్తి చేయలేకపోయిందని, ఇకపై జాప్యానికి అవకాశం లేకుండా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సమావేశం సూచించింది.

సరూర్‌నగర్ చెరువును కాలుష్యరహిత లేక్ గా అభివృద్ధి  చేయాలని గతంలో తీసుకొన్న నిర్ణయంపై  పీసీబీ నేటివరకు ప్రణాళికను సిద్ధం చేయలేకపోయిందని సమావేశం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజిత్‌కుమార్ షైనీ మాట్లాడుతూ చెరువులు ఆక్రమణలకు గురైనట్లు ఫిర్యాదులు వస్తే వాటిని ఇరిగేషన్ విభాగం స్వీకరించాలా..?   రెవెన్యూ విభాగమా..?  లేక స్థానిక సంస్థలు తీసుకోవాలా అన్నదానిపై  ఇంతవరకు స్పష్టత లేదని దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

నిధుల లేమి వల్ల లేక్ ప్రొటక్షన్ కమిటీ ముందడుగు వేయలేక పోతోందని, దీనిస్థానంలో బెంగళూరు తరహాలో ‘లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తే చెరువుల అభివృద్ధి కల సుసాధ్యం అవుతుందని ఎన్జీఆర్‌ఐ ప్రతినిధి పేర్కొన్నారు. పలు విభాగాల అధికారుల సూచనలను ఆలకించిన కమిటీ  వీటిని ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించింది. ఎఫ్‌టీఎల్ ఖరారు, సర్వే నంబర్ల సర్టిఫికేషన్ వ్యవహారం పూర్తయితే... ఆయా చెరువుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.  ప్రతి 15 రోజులకోసారి లేక్ ప్రొటక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.
 
ఆచరణకు దూరంగా..  
లేక్ ప్రొటక్షన్ కమిటీ తీసుకొంటున్న నిర్ణయాలు చర్చలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చెరువుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం వల్ల కమిటీ నిర్ణయాలు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చడం లేదు. ఒక్కో చెరువుకు ఒక్కో నివేదిక (బుక్)ను ప్రత్యేకంగా తయారు చేయాలని గతంలో లేక్ ప్రొటక్షన్ కమిటీ  నిర్ణయించింది. ఈ బుక్‌లో ఆ చెరువుకు సంబంధించిన రెవెన్యూ మ్యాపుతో పాటు ఎఫ్‌టీఎల్ సర్వే నంబర్లు, ఇన్‌స్పెక్షన్ రిపోర్టు, సరిహద్దులు తదితర సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపర్చాలని కూడా నిర్ణయించారు. అయితే... ఆ నిర్ణయాల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.  

చెరువుల అభివృద్ధికి  బడ్జెట్‌లో రూ.70కోట్లు నిధులు కేటాయించాలని హెచ్‌ఎండీఏ కోరినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ‘లేక్ ప్రొటక్షన్ కమిటీ’కి మింగుడు పడకుండా ఉంది. ఆయా చెరువుల్లో కొన్నింటినైనా ‘మిషన్ కాకతీయ’ స్కీంలో చేర్చి ఉంటే కొంత ప్రయోజనం ఉండేదన్న అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. హెచ్‌ఎండీఏ మెంబర్ ఎన్విరాన్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగి ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్,  రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జేసీలు, పీసీబీ, పోలీసు, ఎన్జీఆర్‌ఐ, అటవీశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement