
రైతులందరికీ రుణాలిచ్చేలా చూడండి
జిల్లా వ్యవసాయాధికారులు, బ్యాంకు మేనేజర్లకు పోచారం ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా వ్యవసాయాధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్లు చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, విత్తన గ్రామ కార్యక్రమం, ఇప్పటివరకు జరిగిన పంటల సాగు, హరితహారంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి పంట రుణాల రెన్యువల్స్ పూర్తిచేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్లకు సూచించారు. వడ్డీ లేని రుణాల కింద రైతుల నుంచి ఎటువంటి వడ్డీ వసూలు చేయకూడదని ఆదేశించారు.
ఈ మేరకు అన్ని జిల్లా బ్యాంకులకు మార్గదర్శకాలు పంపించామన్నారు. హరితహారం కింద రైతులు తమ పొలాల గట్లమీద, ఇతరత్రా పెద్దఎత్తున మొక్కలు నాటేలా చూడాలన్నారు. పసుపు పంటకు కొత్త విత్తనం తీసుకున్న రైతులు... పంట పండాక దాన్నే విత్తనంగా వాడుకోవాలని సూచించారు.