నకిలీ రక్తం కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
* నరేంద్రప్రసాద్‌ను అరెస్ట్ చేసిన సుల్తాన్‌బజార్ పోలీసులు
* ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆ నలుగురి కోసం గాలింపు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ రక్తం కేసులో ప్రధాన నిందితుడు కె.నరేంద్రప్రసాద్ అలియాస్ నరేందర్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో వారం క్రితం కల్తీ రక్తాన్ని రోగులకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నగరంలోని వివిధ బ్లడ్‌బ్యాంక్‌లకు చెందిన నకిలీ లేబుళ్లు పట్టుబడిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి పరారీలో ఉన్న సూత్రధారి నరేంద్రప్రసాద్ తన ఫోన్‌ను సైతం స్విచ్చాఫ్ చేశాడు. అయితే అతను చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం గ్రామంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నగర పోలీసులు ఈ నెల 24న అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో నరేంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మదనపల్లిలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. నరేందర్‌తో పాటు ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాన్ని తేల్చడానికి గురువారం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి మరో మూడు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరి అనుమతి తీసుకున్నట్లు సమాచారం.
కల్తీ రక్తం కేసులో ఆ నలుగురు..
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నరేంద్రప్రసాద్‌కు సహకరించిన వారెవరనేది పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. కొంతమంది ఆస్పత్రి సిబ్బంది తమకు తెలిసిన పెద్దలతో పోలీసులకు చెప్పించి కేసు నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేశారని సమాచారం. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఓ ఆస్పత్రి నుంచి లేబుళ్లు సరఫరా కాగా బొగ్గులకుంటలోని మరో ఆస్పత్రి నుంచి రక్తం నింపేందుకు ప్యాకెట్లు సరఫరా అయినట్లు విశ్వసనీయ సమాచారం. వీరే కాక కొంత మంది బ్లడ్ బ్యాంక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందితో కలసి మొత్తం నలుగురి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. వీరు ఏడాదిగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.