Sultan Bazar Police
-
ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు ఆపదలో ఉన్న బాధితులనే కాదు... మూగజీవులనూ రెస్క్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుల్తాన్‌బజార్ గస్తీ సిబ్బంది సోమవారం ఉదయం గేట్ గ్రిల్లో చిక్కుకున్న ఓ పిల్లికి ప్రాణం పోశారు. ఈ విషయాన్ని సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్లో పోస్టు చేసిన అధికారులు దాంతో పాటు ఓ ప్రశ్నను సంధించారు. దీనికి అనేకమంది నెటిజనుల తమదైన శైలిలో స్పందిస్తూ సలహాలు, సూచలు ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుల్తాన్‌బజార్ ఠాణాకు చెందిన పెట్రో కార్–1 సిబ్బంది సోమవారం ఉదయం తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్నారు. వీరి వాహనం కుబ్తిగూడలోని థామస్ చర్చి వద్దకు చేరుకునే సరికి ఓ ఇంటి వద్ద హడావుడి కనిపించింది. అక్కడకు వెళ్లిన గస్తీ పోలీసులు ఆరా తీయగా.. ఆ ఇంటి గేటు గ్రిల్లో పిల్లి తల ఇరుక్కుందని, బయటకు తీసుకోవడానికి అది నానా తంటాలు పడుతోందని గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మార్జాలానికి గ్రిల్ నుంచి విముక్తి కల్పించారు. పిల్లి గ్రిల్లో చిక్కుకున్న ఫొటోను పోస్టు చేసిన సిటీ పోలీసు ఫేస్బుక్ పేజ్ దాంతో పాటు ‘పిల్లిని విడుదల చేయడానికి సులభమైన మార్గాన్ని వ్యాఖ్యానించండి’ అంటూ పేర్కొన్నారు. దీనికి నెటిజనుల నుంచి భారీ స్పందన వచ్చింది. తమకు తోచిన సూచనలు చేశారు. కొందరైతే అలా చిక్కుకున్న పిల్లులను బయటకు తీయడానికి అనుసరించాల్సిన విధానాలతో కూడిన యూట్యూబ్ వీడియోల లింకుల్నీ షేర్ చేశారు. పిల్లి తలకు, గ్రిల్‌కు నూనె పూసి తీయాలని, వెల్డింగ్‌తో కట్ చేయాలని ఇలా సలహాలు ఇచ్చారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ, ఆయన భార్య మృతి చెందారు. నగరంలోని సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుందరి లక్ష్మణ్ (39) కొత్తపేటలో నివాసముంటున్నారు. లక్ష్మణ్ రెండు రోజులక్రితం తన భార్య ఝాన్సీ(34), కుమారుడు సాహస, కూతురు ఆకాంక్షతో కలసి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలోని ఝాన్సీ పుట్టింటికి వెళ్లారు. కూతురు ఆకాంక్షను ఝాన్సీ తల్లిదండ్రుల వద్ద వదిలి శుక్రవారం రాత్రి తమ స్విఫ్ట్ కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కారును ఝాన్సీ నడుపుతుండగా లక్ష్మణ్ ముందు సీటులో, కుమారుడు సాహస వెనక సీటులో కూర్చున్నారు. అర్ధరాత్రి వీరు ప్రయాణిస్తున్న కారు అబ్దుల్లాపూర్‌మెట్ శివారులోని ఇనాంగూడ గేట్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన లక్ష్మణ్, ఝాన్సీ కారులోనే మృతిచెందగా, సాహసకు స్వల్పగాయాలయ్యాయి. ‘మా అమ్మనాన్నలను కాపాడండి’ అంటూ సాహస ఏడుస్తూ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలిచారు. చదవండి: (దారుణం: పెళ్లికి నిరాకరించిందని..) -
గోదాంలో రూ. 61.6 లక్షల పాత కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: ఒక గోదాంలో అక్రమంగా దాచి ఉంచిన రూ.61.60 లక్షల పాత కరెన్సీని హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పోర్ట్స్ కిట్స్ పేరిట హనుమాన్టేకిడీలో అహ్మద్ అనే వ్యక్తి ఒక గోదాంను అద్దెకు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విశ్వనీయ సమాచారం మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు గోదాంపై దాడిచేశారు. అందులో ఉన్న రూ.61.60 లక్షల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు లక్షల రూపాయల పాత కరెన్సీ అహ్మద్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ రక్తం విక్రయం.. మరో ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ : కల్తీ రక్తం విక్రయం కేసులో మరో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ల్యాబ్ టెక్నిషియన్ నరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారంతో సుల్తాన్ బజార్ పోలీసులు శనివారం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నరేంద్ర ప్రసాద్ మూడు రోజలుగా పోలీస్ కస్టడీలో ఉన్నాడు. తమ కస్టడీలో ఉన్న నిందితుడుని పోలీసులు తమదైన శైలీలో ప్రశ్నించడంతో కల్తీ రక్తం విక్రయం వ్యవహారమంతా బయటపెట్టేశాడు. కాగా, నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తంలో నార్మల్ సెలైన్ వాటర్ కలిపి కల్తీ చేయడమే కాకుండా వాటికి స్టిక్కర్లు అతికించి విక్రయిస్తుండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న నరేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అధికారుల ఫిర్యాదు మేరకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు, పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా నకిలీ గుట్టు రట్టైంది. -
నకిలీ రక్తం కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
* నరేంద్రప్రసాద్‌ను అరెస్ట్ చేసిన సుల్తాన్‌బజార్ పోలీసులు * ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆ నలుగురి కోసం గాలింపు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ రక్తం కేసులో ప్రధాన నిందితుడు కె.నరేంద్రప్రసాద్ అలియాస్ నరేందర్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో వారం క్రితం కల్తీ రక్తాన్ని రోగులకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నగరంలోని వివిధ బ్లడ్‌బ్యాంక్‌లకు చెందిన నకిలీ లేబుళ్లు పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న సూత్రధారి నరేంద్రప్రసాద్ తన ఫోన్‌ను సైతం స్విచ్చాఫ్ చేశాడు. అయితే అతను చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం గ్రామంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నగర పోలీసులు ఈ నెల 24న అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో నరేంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మదనపల్లిలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. నరేందర్‌తో పాటు ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాన్ని తేల్చడానికి గురువారం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి మరో మూడు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. కల్తీ రక్తం కేసులో ఆ నలుగురు.. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నరేంద్రప్రసాద్కు సహకరించిన వారెవరనేది పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. కొంతమంది ఆస్పత్రి సిబ్బంది తమకు తెలిసిన పెద్దలతో పోలీసులకు చెప్పించి కేసు నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేశారని సమాచారం. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఓ ఆస్పత్రి నుంచి లేబుళ్లు సరఫరా కాగా బొగ్గులకుంటలోని మరో ఆస్పత్రి నుంచి రక్తం నింపేందుకు ప్యాకెట్లు సరఫరా అయినట్లు విశ్వసనీయ సమాచారం. వీరే కాక కొంత మంది బ్లడ్ బ్యాంక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందితో కలసి మొత్తం నలుగురి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. వీరు ఏడాదిగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. -
నరేందర్ ఇంట్లో పోలీసులు సోదాలు
హైదరాబాద్ : సరూర్‌నగర్‌లో నివసిస్తున్న రక్తం కల్తీకి పాల్పడుతున్న రక్తనిధి ల్యాబ్ టెక్నీషియన్ నరేందర్ నివాసంలో సుల్తాన్ బజార్ పోలీసులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని నివాసం నుంచి పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో నకిలీ రక్తం నరేందర్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. బ్లడ్ ప్యాకెట్లలో సెలైన్ బాటిళ్లు కలుపుతున్నట్లు వైద్యులు గురువారం గుర్తించారు. దీంతో నరేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.