చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు | Police firings to chain snacthers | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు

Published Tue, Nov 3 2015 2:52 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

పారిపోతున్న స్నాచర్లపై కాల్పులు జరుపుతున్న పోలీసులు(సీసీ టీవీ దృశ్యం) - Sakshi

పారిపోతున్న స్నాచర్లపై కాల్పులు జరుపుతున్న పోలీసులు(సీసీ టీవీ దృశ్యం)

- వనస్థలిపురం ఆటోనగర్ వద్ద చైన్ స్నాచింగ్‌కు యత్నం
- మహిళ మెడలో బంగారు గొలుసు తెంపబోయిన దుండగులు
- స్నాచర్లపై తుపాకీతో కాల్పులు జరిపిన సీసీటీమ్ సిబ్బంది
- పోలీసుల సమన్వయలోపంతో తప్పించుకున్న స్నాచర్లు

 
హైదరాబాద్: ఉదయం 11.02: ఎల్బీనగర్‌లోని సాయినగర్‌కాలనీ వాసి సాయి అనురాధ.. రాజధాని హోటల్ నిర్వహిస్తున్న భర్తను కలసి ఇంటికి వెళ్తోంది. ఉదయం 11.06: ఆటోనగర్ సిగ్నల్ నుంచి సాయినగర్ వైపు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని బ్లాక్ పల్సర్ బైక్‌పై ఆమెను అనుసరించారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి ముఖానికి హాఫ్ మాస్క్, బైకర్ హెల్మెట్ ధరించి ఉన్నారు. ఆమెకు దగ్గరగా బైక్‌ను పోనిచ్చి మెడలోని బంగారు గొలుసును తెంచేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన అనురాధ స్నాచర్ల చేతిలో గొలుసు చిక్కకుండా జాగ్రత్తపడింది.
 
ఉదయం 11.07: అదే సమయంలో అక్కడే మాటువేసి ఉన్న ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్ (సీసీ టీమ్) కానిస్టేబుళ్లు రవిశంకర్, నరేందర్ పారిపోతున్న స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నరేందర్ దుండగులను పట్టుకోబోగా వారు బైక్ వేగాన్ని పెంచారు. ఇది గమనించిన రవిశంకర్ తన దగ్గర ఉన్న తుపాకీతో దుండగులపై అతి సమీపం నుంచి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయినా స్నాచర్లు తప్పించుకుని పారిపోయారు.
 
ఉదయం 11.09: స్నాచర్లను వెంబడించే క్రమంలో కానిస్టేబుళ్లు తమ బైక్‌ను స్టార్ట్ చేసేందుకు మూడు నిమిషాల వరకు సమయం తీసుకున్నారు. ఆ గ్యాప్‌లోనే స్నాచర్లు అక్కడి నుంచి ఉడాయించడం జరిగిపోయింది. పనామా చౌరస్తా వరకు వెళ్లిన తర్వాత దుండగుల వాహనం కనబడలేదు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించినా స్నాచర్లు చిక్కలేదు. దుండగులు చింతల్‌కుంట చెక్‌పోస్టు వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ద్విచక్ర వాహనం వెంటనే స్టార్ట్ కాకపోవడం కూడా స్నాచర్లు పారిపోవడానికి ఒక కారణమని తెలుస్తోంది.
 
పోలీసుల మధ్య లోపించిన సమన్వయం..
లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయలోపం కారణంగా గొలుసు దొంగలు తప్పించుకోగలిగారు. కాల్పులు జరిపిన అనంతరం సీసీ టీమ్స్ బృందం ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించింది. ఈ విషయాన్ని వెంటనే ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లయితే సుష్మా చౌరస్తా, పనామా చౌరస్తా, చింతలకుంట చెక్‌పోస్టు వద్ద స్నాచర్లను పట్టుకునే అవకాశం ఉండేది. పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే స్నాచర్లు తప్పించుకున్నట్లు స్పష్టమవుతోంది.
 
చూస్తున్నారే కానీ ముందుకు రాలేదు..
ఆటోనగర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. ఘటన జరిగిన సమయంలో కూడా అక్కడ చాలా మందే ఉన్నారు. కానీ పోలీసులకు సహకరించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. ప్రజలు సహకరించి ఉంటే స్నాచర్లు తప్పించుకునేవారు కాదని పోలీసులు అంటున్నారు. నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు ఎంత ప్రచారం చేసినా ఆశించిన స్పందన రావట్లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
 
కాల్పులు జరిపిన రవిశంకర్ ఏమన్నాడంటే..
 ‘‘డ్యూటీలో భాగంగా ఉదయం 11 గంటల సమయంలో ఆటోనగర్ సిగ్నల్ సమీపంలో వాహనాలను పరిశీలిస్తున్నాం. ఈ సమయంలో అనుమానాస్పదంగా పల్సర్ వాహనంపై వచ్చిన సుమారు 25-30 ఏళ్ల వయసున్న యువకులు అనురాధ మెడలోని చైన్‌ను తెంపేందుకు ప్రయత్నించారు. నా తోటి కానిస్టేబుల్ నరేందర్ దొంగలను పట్టుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. కొద్ది దూరంలోనే ఉన్న నేను వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపినా దొంగలు తప్పించుకున్నారు. దొంగలను పట్టుకోలేకపోవడం బాధగా ఉంది.’’
 
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జాయింట్ సీపీ..

విషయం తెలుసుకున్న సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి, డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ భాస్కర్‌గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని కాల్పులు జరిగిన తీరును పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బ్యాంకు సీసీటీవీ ఫుటేజీలో స్నాచర్లు మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నించిన దృశ్యం, వెంటనే తేరుకున్న కానిస్టేబుళ్లు కాల్పులు జరిపిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.
 
పట్టుకుని ఉంటే ఫలితముండేది..
బాధితురాలు సాయి అనురాధ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘కళ్లు మూసితెరిచేలోపే స్నాచర్లు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన నేను మూడు తులాల గొలుసును గట్టిగా పట్టుకున్నాను. అక్కడే ఉన్న పోలీసు లు దుండగులపై కాల్పులు జరిపినా తప్పిం చుకున్నారు. వారిని పట్టుకుని ఉంటే ఫలితం ఉండేది’’ అని అన్నారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడే షాపులో ఉన్న నరేష్ అనే వ్యక్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘అనురాధ నడిచి వెళ్తుండగా పల్సర్‌పై వచ్చిన ఇద్దరు.. యూటర్న్ తీసుకుని ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు తేరుకుని దుండగులపై కాల్పులు జరిపారు’’ అని చెప్పాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement