మృత్యు క్రీడ | pollute the pond | Sakshi
Sakshi News home page

మృత్యు క్రీడ

Published Wed, Aug 12 2015 12:02 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

మృత్యు క్రీడ - Sakshi

మృత్యు క్రీడ

మనుషుల ప్రాణాలంటే గోదాముల నిర్వాహకులకు లెక్కే ఉండదు. అందుకే కాలుష్యాన్ని అరికట్టడానికి ... రసాయనాలు

గాలిలో కలుస్తున్న ప్రాణాలు 
స్పందించని యాజమాన్యాలు
అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు
చెరువు నీరూ కలుషితం
గోదాములను పరిశీలించిన సర్పంచ్, అధికారులు
 ‘సాక్షి’ కథనానికి స్పందన

 
కుత్బుల్లాపూర్: మనుషుల ప్రాణాలంటే గోదాముల నిర్వాహకులకు లెక్కే ఉండదు. అందుకే కాలుష్యాన్ని అరికట్టడానికి ... రసాయనాలు ప్రాణాంతకంగా మారకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు. ఎక్కడో ఉంటున్న వ్యాపారులకు కుత్బుల్లాపూర్ మండలం ఐడీఏ దూలపల్లి కాసులు కురిపించే అడ్డాగా మారుతోంది. స్థానికులకు... కార్మికులకు మాత్రం అది మృత్యు కుహరమవుతోంది. ఈపారిశ్రామికవాడలో అనుమతి లేని గోదాములు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చే వ్యర్ధ రసాయనాలు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. 2014 ఆగస్టులో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన సురంజన్ సింగ్ (21), భజరంగ్ సింగ్‌లు ఓ డీసీఎం వాహనంలో వచ్చిన వ్యర్ధ రసాయనాలతో కూడిన డ్రమ్ములను దించేందుకు ఉపక్రమించారు. రసాయనాల గాఢత ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ అక్కడే సృ్పహ తప్పి పడిపోయారు. సంబంధిత యాజమాన్య ప్రతినిధులు వారిని షాపూర్‌నగర్ రామ్ ఆస్పత్రిలో చేర్పించి పత్తా లేకుండా పోయారు. పత్రికల్లో వార్తలు రావడంతో ఒక రోజు తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే సురంజన్ సింగ్ మృతి చెందాడు. భజరంగ్ సింగ్ చికిత్స అనంతరం కనిపించకుండా పోయాడు. ఇలాంటి సంఘటనలు అక్కడ నిత్య కృత్యం. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా బయటపడవు.

 ఫాక్ సాగర్ చెరువుకు ముప్పు
ఐడీఏ దూలపల్లికి కూతవేటు దూరంలో ఉన్న ఫాక్ సాగర్ చెరువులో కలుషిత జలాలు కలుస్తున్నా రెవెన్యూ.. పీసీబీ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఘాటైన రసాయనాలను ట్యాంకర్లలో తీసుకొచ్చి చెరువు పరిసర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా ఈ చెరువు సమీపంలో ప్రమాదకరమైన రసాయనాలు దర్శనమివ్వడం గమనార్హం. వీటి ప్రభావంతోగడ్డి, మొక్కలు మాడిమసయ్యాయి. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాక్‌సాగర్‌లో వ్యర్ధాలు కలిసి ఇప్పటికే చేపలు మృత్యువాత పడుతుండగా... భూమిలోకి కూడా ఇవి ఇంకి బోరు వేస్తే రంగునీళ్లు వస్తున్నాయి.

 నోటీసులకు బెదరకుండా...
 ఈ ఏడాది జూన్ నెలలో గ్రామ పంచాయతీ అధికారులు 76 కంపెనీలకు అనుమతులు లేవని నోటీసులు జారీ చే శారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. కనీసం నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఈవిషయమై ఎంపీడీఓ, ఈవోఆర్డీలకు సర్పంచ్ చింతల లక్ష్మి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన అధికారులు ఏకంగా 105 కంపెనీలను గుర్తించి గోడలకు నోటీసులు అంటించారు. వాటిని యాజమాన్యాలు చించేశాయి. అంతేకాకుండా కంపెనీల ఆవరణలోనే పెద్ద పెద్ద గుంతలు తవ్వి అందులో రసాయన డ్రమ్ములు నిల్వ చే స్తున్నారు. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 అంతా ఆయన కనుసన్నల్లోనే.. దూలపల్లిలోని సర్వే నెంబరు 135లో అక్రమ గోదాముల విషయంలో ఇప్పటికే ఇద్దరు ఈవోలు సస్పెండయ్యారు. అయినా ఆ స్థానంలోకి వచ్చే అధికారుల తీరు మారడం లేదు. ప్రస్తుతం పంచాయతీలోని ఓ ముఖ్య అధికారి సైతం పాత వారి బాటలోనే నడుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చెబుతున్న లెక్కలకు... ఇక్కడి నిర్మాణాలకు పొంతన లేదు. తాము మూడే అనుమతులు ఇచ్చామని స్థానిక ఈవో చెబుతుండగా... ఇక్కడ మాత్రం పదుల సంఖ్యలో గోదాములు వెలిశాయి. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారు.

సర్పంచ్ అవాక్కు... అక్రమ గోదాముల వ్యవహారంపై ‘సాక్షి’లో మంగళవారం ‘జల గరళం’ శీర్షికతో ప్రచురించిన కథనానికి సర్పంచ్ చింతల లక్ష్మి స్పందించారు. ఈవో విజయ్‌కుమార్, బిల్ కలెక్టర్ కరుణాకర్‌రెడ్డితో కలసి గోదాములను పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం ఈప్రాంతంలో పర్యటించిన వారికి ఖాళీ స్థలం కనిపించగా... అదే చోట మంగళవారం ఒక కెమికల్ గోదాము, పక్కనే పునాదులు కనిపించడంతో సర్పంచ్ అవాక్కయ్యారు. అనుమతులు లేకుండా ఈ నిర్మాణాలు ఏమిటని ఈవోను ప్రశ్నిస్తే... సరిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

నిర్వాహకులు పరార్.. అక్రమ గోదాముల విషయంపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘జల గరళం’ కథనం చర్చనీయాంశమైంది. దీన్ని చూసిన అనుమతులు లేని కంపెనీల నిర్వాహకుల్లో కొందరు పత్తాలేకుండా పోయారు. మరి కొందరు తాళాలు వేసి లోపల పనులు కొనసాగించారు. ఇక్కడి ప్రమాదకర పరిస్థితులను అర్థం చేసుకొని... అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని...తమ ప్రాణాలు కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement