సాక్షి, కరీంనగర్: సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మిస్టరీ కేసు మరో మలుపు తిరగనుంది. పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇంటి పెద్ద వేముల శ్రీకాంత్ తన భార్యాపిల్లలపై విషప్రయోగం చేశాడని నిర్ధారణ అయితే.. పిల్లల మృతదేహాలకూ పోస్టుమార్టం తప్పేలా లేదు. డిసెంబరు 30న అర్ధరాత్రి వేముల శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే విషయాన్ని చికిత్స సమయంలో వైద్యులకు చెప్పాడు. ఈ పరిణామంతో పోలీసుల దర్యాప్తు అకస్మాత్తుగా శ్రీకాంత్ వైపు తిరిగింది.
శ్రీకాంత్ బయోటెక్నాలజీలో పీజీ చేయడం.. ఫుడ్ సైన్స్ లెక్చరర్ కావడం.. రోజూ ప్రయోగాల కోసం ల్యాబ్‌లో రసాయనాలు వినియోగించడం.. వెరసీ అతనికి కెమికల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉందని పోలీసులు నిర్ధా రణకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల తరహాలోనే తానూ రక్తపువాంతులు, విరోచనాలు చేసుకుని మరణించడంతో వారి శరీరంలోనూ సోడియం హైడ్రాక్సైడ్ చేరిందా..? అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఫోరెన్సిక్ అధికారులు మమత శరీరంలో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వారు మరింత లోతుగా రసాయన విశ్లేషణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఎఫ్‌ఎస్‌ఎల్ తుది నివేదిక పంపితే.. మమత మరణానికి స్పష్టమైన కారణం తెలియనుంది.
45 రోజుల్లో నలుగురు
ఈ ఘటనల్లో తొలుత శ్రీకాంత్ కొడుకు అద్వైత్ (20నెలలు)వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురై నవంబరు 16న కన్నుమూశాడు. అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) డిసెంబర్ ఒకటిన ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. అంతుచిక్కని వ్యాధి, కలుషిత తాగునీరు కారణమనుకుని సమీపంలోని బావిలోని తాగునీటిని, బాధితుల బంధువుల రక్తాన్ని పరీక్షించారు. అయినా వారికి ఏమీ చిక్కలేదు.
దీంతో మిస్టరీ మరణాలు చేతబడి, మంత్రాల కారణంగా జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. శ్రీకాంత్ భార్య మమత (26) కూడా అనారోగ్యానికి గురై డిసెంబరు 18న మరణించింది. డిసెంబరు 30న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 45 రోజుల వ్యవధిలో మొత్తం కుటుంబం అనుమానాస్పద స్థితిలో తుడిచిపెట్టుకుపోయింది.
మమత శరీరంలో ఆర్సెనిక్..! మరి పిల్లల్లో..?
పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మమత శరీర భాగాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లను గుర్తించారు. దీన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమె శరీరంలోకి ఎలా చేరింది..? పిల్లల మరణాలకు కారణం ఆర్సెనికా..? లేదా సోడియం హైడ్రాక్సైడా..? అనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
పిల్లలిద్దరూ అనారోగ్య లక్షణాలతో మరణించారని వారికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఇపుడు వారి మరణంపై అనేక సందేహాలు వెలుగులోకి రావడంతో వారి శవాలకు పోస్టుమార్టం తప్పనిసరి కానుంది. అందుకే పిల్లల శరీర భాగాల నుంచి విస్రా (అంతర్భాగాల నుంచి నమూనాలు)ను తీసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్!
రెండు నెలల అనంతరం..
నవంబరు 16న 20 నెలల అద్వైత్ అనుమానాస్పదంగా మరణించాడు. అతడిని గంగాధర శివారులోని వంతెన సమీపంలో ఖననం చేశారు. డిసెంబరు ఒకటిన అమూల్య (6) కూడా కన్నుమూసింది. దీంతో తమ్ముడి సమాధి పక్కనే అక్కనూ ఖననం చేశారు. వీరిలో అద్వైత్ మరణించి 50 రోజులు, అమూల్య చనిపోయి 35 రోజులు దాటింది.
ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు రావడానికి వారం పట్టవచ్చని పోలీసులు అంటున్నారు. ఒకవేళ మమత శరీరంలో విష ఆనవాళ్లు ఉంటే పిల్లల మరణాలకు కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే.. పిల్లలు మరణించిన దాదాపు రెండు నెలల అనంతరం పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment