హైదరాబాద్ : ఖమ్మం జిల్లా సమస్యలను ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించకపోవడంపై టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ... తమ జిల్లా సమస్యలను ప్రధాని వద్ద కేసీఆర్ ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు.
జిల్లాలోని పలు గ్రామాలను ముంపునకు గురి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్న అంశాన్ని సైతం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కరువు బాధిత మండలాలను ఆదుకోవడంలో కూడా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.