విద్యుత్ కేంద్రాల్లో భారీ కుంభకోణం
- అంచనా వ్యయాలు రూ.2500 కోట్లు పెంచారు
- అస్మదీయుల కోసం నిబంధనల మార్పు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో కృష్ణపట్నం (నెల్లూరు), ఇబ్రహీంపట్నం (విజయవాడ) విద్యుత్ కేంద్రాల నిర్మాణం కాంట్రాక్టుల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని, వాటిని వెంటనే రద్దు చేసి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఆయన బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యవసరమైన విద్యుత్ అవసరాలు అంతగా లేకపోయినా అతి ఎక్కువ వ్యయానికి విద్యుత్ ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. గత రెండు మూడేళ్లుగా బొగ్గు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో సగానికి సగం తగ్గినందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని, విభజనతో ఏపీకీ విద్యుత్ కలిసి వచ్చిందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణపట్నం , ఇబ్రహీంపట్నంల వద్ద వేర్వేరుగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తనకు కావాల్సిన కంపెనీలకు అధిక మొత్తాలకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు.
ఎన్టీపీసీ నిబంధనలు తుంగలో తొక్కారు
కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం ప్లాంట్లలో బీటీజీ (బాయిలర్ టర్బయిన్ జనరేటర్)ల నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌కు ఒక మెగావాట్‌కు రూ 2.88 కోట్ల వ్యయంతో ఇవ్వడం సరైనదేనని బుగ్గన తెలిపారు. బీఓపీ (బ్యాలన్స్ ఆఫ్‌ది ప్రాజెక్టు) పనులను ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ కంపెనీకి ఒక మెగావాట్‌కు రూ 2.97 కోట్లకు, కృష్ణపట్నంలో టాటా కంపెనీకి ఒక మెగావాట్‌కు రూ.3.42 కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు. ఇబ్రహీంపట్నంలో బీటీజీ, బీఓపీ కలిపి మెగావాట్ ఒక్కింటికి రూ 5.85 కోట్లు, కృష్ణపట్నంలో రెండూ కలిపి మెగావాట్ ఒక్కింటికి రూ 6.33 కోట్ల వ్యయంతో ఇచ్చేయడమేమిటన్నారు. తెలంగాణలోని కొత్తగూడెం విద్యుత్ ప్రాజెక్టులో రూ 4.76 కోట్లు, యాదాద్రి ప్రాజెక్టులో రూ 4.48 కోట్లు, గుజరాత్‌లో వనక్‌భోరిలో రూ 4.3 కోట్లు, మధ్యప్రదేశ్‌లోని బరేతిలో ఎన్టీపీసీ చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులో రూ 3.94 కోట్లతో ఒక్కో మెగావాట్‌ను నిర్మిస్తుండగా... ఏపీలో అంచనా వ్యయాన్ని భారీగా పెంచి దోపిడీకి తెరలేపారన్నారు. మొత్తానికి అంచనా వ్యయం 2,500కోట్లకు పెంచేశారన్నారు.