హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. దాదాపు 3 లక్షల ఇళ్ళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 162 ఫీడర్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల స్తంభాలు వంగిపోవడం, కూలిపోవడం జరిగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 280 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్తగా మరో 200 ఫీడర్ల పరిధిలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈదురుగాలులు లేకపోవడం వల్ల నష్టం పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు.
అయితే, వర్షాలకు నీరు చేరి సబ్ స్టేషన్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్టు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని జిల్లా అధికారులు అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో వీలైనంత తొందరలోనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్టు క్షేత్రస్థాయి సిబ్బంది తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సిబ్బంది వెళ్ళడం, అవసరమైన విద్యుత్ ఉపకరణలు తీసుకెళ్ళడం కష్టంగా ఉందంటున్నారు. పల్నాడు ప్రాంతంలో అన్ని రకాల వాగులు, వంకలు, కాల్వలు పొంగుతున్నాయి. రవాణా కూడా కష్టంగా ఉంది.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సేవలు పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం ఒక్కరోజే 62 ఫీడర్ల పరిధిలోని దాదాపు 1.50 లక్షల విద్యుత్ వినియోగదారులకు అంతరాయం కలిగింది. కృష్ణలో 6 వేలు, చిత్తూరులో 24 వేలు, గుంటూరులో 60 వేల విద్యుత్ కనెక్షన్లకు తరచూ అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, యుద్ధప్రాతిపదిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నామని పంపిణీ సంస్థల సీఎండీలు తెలిపారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
ఏపీలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం
Published Fri, Sep 23 2016 6:48 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement