-ఇంటర్మీడియట్‌లో దేశ వ్యాప్త అమలుకు ప్రతిపాదన
- ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్ అమలుకు సిలబస్ కమిటీ చర్యలు
- వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం
హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా చర్యలు చేపట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్మీడియట్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయ పడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ విద్యలో, సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో 10+2 విధానంలోనూ కామన్ కోర్ సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని గురువారం తీర్మానించింది.
అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టుల్లో (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల మేరకు ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగానే ఉందని, దానిని మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చింది.
ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది. సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఇంటర్మీడియట్ బోర్డు ఛైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్‌సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆర్‌ఎంఎస్‌ఏ విభాగం హెడ్ ప్రొఫెసర్ రంజనా అరోరా, సీబీఎస్‌ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, ఆయా సబ్జెక్టుల్లోనూ 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. మిగితా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించింది. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని, 5 నుంచి 10 శాతం వరకే ఆయా రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆప్షనల్ సిలబస్‌ను రూపొందించుకునే అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్ ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచేలా ఉండేలా ఈ చర్యలు చేపట్టింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిలీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
సైన్స్ గ్రూపుల్లో సగం సిలబస్‌లో ప్రాక్టికల్స్
Published Thu, Jan 28 2016 8:02 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement