
డిజిటల్ మనీతో జాగ్రత్తలు ఇవీ..
నగదు రహిత లావాదేవీలతో లాభాలు ఎన్ని ఉన్నా.. సైబర్ ప్రపంచం తీరుతెన్నులపై అవగాహన లేకుంటే మాత్రం నష్టపోక తప్పదు. అందుకే నగదు రహిత లావాదేవీలు జరిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
► క్రెడిట్, డెబిట్ కార్డుల పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్)ను గోప్యంగా ఉంచుకోవాలి. దానిని తరచుగా మార్చుకుంటూ ఉండాలి.
► నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇంటిపేర్లను పాస్‌వర్డ్‌లుగా వాడుతూంటారు. అలా కాకుండా.. ప్రతి పాస్‌వర్డ్‌లో కొన్ని అక్షరాలు, ఒకట్రెండు అంకెలు, ప్రత్యేక సంకేతాలు ఉండేలా రూపొందించుకోవాలి. పాస్‌వర్డ్ ఎనిమిది అక్షరాలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది.
► వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లు వాడాలి. వాటిని ఎక్కడైనా రాసిపెట్టుకోవడం కూడా మంచిది కాదు. బదులుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే పాస్‌వర్డ్ మేనేజర్లను వాడటం మేలు. వీటిలో మీ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లను నిక్షిప్తం చేసినా.. అవి ఎన్‌స్క్రిప్ట్ అవుతారుు కాబట్టి ఇతరులు తెలుసుకునే అవకాశం తక్కువ.
► ఇటీవల చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాంటి బహిరంగ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలను చేయకపోవడమే మేలు.
► స్మార్ట్‌ఫోన్లలో అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ నుంచి కొన్ని వివరాలు తీసుకునేందుకు అప్లికేషన్ తయారీదారులు అనుమతులు కోరతారు. ఏయే వివరాలు కోరుతున్నారో గమనించడం అవసరం.
► స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలో లేటెస్ట్ యాంటీ వైరస్, మాల్‌వేర్, స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌లు ఉండేలా జాగ్రత్త పడాలి.
► మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి ప్రలోభాలు ఎర చూపుతూ వచ్చే మెయిళ్లను, అటాచ్‌మెంట్లను ఓపెన్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
► ఏ బ్యాంకు, ఆర్థిక సంస్థ మెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా మీ వివరాలు కోరదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలి.