వద్దంటే రద్దయిపోతారు
♦ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకూ కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలుకు సన్నాహాలు
♦ అంచనాల పెంపునకు అడ్డుచెబుతున్న కమిటీలపై వేటు..
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అడ్డు చెబుతున్న కమిటీలపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అంచనాల పెంపుపై తమ నిర్ణయాలను వ్యతిరేకించిన అధికారులున్న కమిటీలనే రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) నియమావళికి వ్యతిరేకంగా పోలవరం హెడ్‌వర్క్స్ పనులకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టులకూ కొత్త ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్)ను వర్తింపజేయడానికి సిద్ధమవుతోంది.
ఈపీసీ విధానంలో కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వర్తింపజేయాల్సిన అవసరం లేకపోయినా.. పోలవరంలో భారీ మామూళ్ల రుచి చూసిన చినబాబు.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేయిస్తామని, ఫలితంగా దక్కే అదనపు సొమ్ములో వాటా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇసుక ఉచితం.. స్టీలు, అల్యూమినియం, పెట్రోలు-డీజిల్, సిమెంట్ ధరలు తగ్గాయి. అన్నీ తగ్గిన నేపథ్యంలో.. అంచనా వ్యయం తగ్గాలి. కానీ కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు పేరిట అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం, ఆ మేరకు కాంట్రాక్టర్ల నుంచి భారీగా సొమ్ము దండుకోవడమే లక్ష్యంగా.. చినబాబు ముఠా సాగిస్తున్న వ్యవహారాన్ని చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు.
పోలవరం హెడ్‌వర్క్స్ పనుల అంచనా వ్యయాన్నే కొత్త ఎస్‌ఎస్‌ఆర్ పేరిట రూ. మూడు వేల కోట్లు పెంచిన ప్రభుత్వం.. మిగతా ప్రాజెక్టుల పనుల అంచనా వ్యయాన్ని కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేయడం ద్వారా ఖజానా మీద రూ. 20 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అంచనాల పెంపునకు అభ్యంతరాలు చెబుతున్న, అడ్డు తగులుతున్న ఎస్‌ఎల్‌ఎస్‌సీ, ఇంటర్నల్ బెంచ్ మార్క్ (ఐబీఎం) కమిటీతో పాటు జిల్లాస్థాయి స్టాండింగ్ కమిటీలను ఒక్క కలం పోటుతో రద్దు చేయడానికి ప్రభుత్వం తెగిస్తోంది. అన్ని కమిటీలనూ రద్దుచేసి ‘కమిషన్ ఆఫ్ టెండర్స్’కే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
అడ్డు తొలగించుకుంటే సరి!
పోలవరం హెడ్‌వర్క్స్ పనులకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేయడం వల్ల అంచనా వ్యయం రూ. 4,050 కోట్ల నుంచి దాదాపు రూ. ఏడు వేల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఫలితంగా.. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్‌ట్రాయ్’కి భారీ ప్రయోజనం చేకూరింది. ఇదే తరహాలో తమకూ కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వర్తింపజేయాలంటూ అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. వాస్తవంగా ఈపీసీ పద్ధతిన ఒప్పందాలు జరిగిన ప్యాకేజీలకు ధరల విషయంలో మరే మార్పులు, చేర్పులు, మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదు. దీని ప్రకారం ఎస్‌ఎస్‌ఆర్‌లు పెంచడానికి మార్గదర్శకాలు అంగీకరించవు.
కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేయిస్తామని, ఫలితంగా దక్కే అదనపు సొమ్ములో వాటా ఇవ్వాలంటూ చినబాబు ముఠా కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వంశధార ప్రాజెక్టుల్లో పలు ప్యాకేజీలకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వర్తింపజేయడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. మిగతా ప్యాకేజీల్లోనూ ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేయడం వల్ల ప్రభుత్వం మీద అదనంగా రూ. 20 వేల కోట్లకు పైగా భారం పడుతుందని జల వనరుల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. చినబాబు సూచనల మేరకు.. కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలు చేయాలని జల వనరుల శాఖకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం.
అయితే కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని, ఖజానాపై పెనుభారం పడుతుందంటూ ప్రతిపాదనను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) వ్యతిరేకించింది. గతంలో కాంక్రీట్ పనులకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్ అమలును, హంద్రీ-నీవా, గాలేరు-నగరి అంచనాల పెంపును ఈ కమిటీ వ్యతిరేకించిందింది. ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఐబీఎం కమిటీ, ఆర్థిక శాఖ కూడా పలుమార్లు వ్యతిరేకించాయి. అంచనాల పెంపును ఇద్దరు సీఎస్ లు కూడా వ్యతిరేకించిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టినప్పుడు ప్రభుత్వం ఇరుకున పడిన విషయం తెలిసిందే. ఇలా అంచనాల పెంపును కమిటీలు, అధికారులు వ్యతిరేకించిన ప్రతిసారీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌ఎస్‌సీ, ఐబీఎం కమిటీతో పాటు జిల్లాస్థాయి స్టాండింగ్ కమిటీలనూ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
హైపవర్ కమిటీని రద్దు చేస్తారా?
రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదించిన తర్వాతే కాంట్రాక్టును ఇవ్వాలనే నిబంధన ఉంది. పట్టిసీమ, కుప్పం బ్రాంచ్ కెనాల టెండర్ల విషయంలో హైపవర్ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకోకుండా వెనకాడినప్పుడు ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చి సానుకూల నిర్ణయం తెప్పించుకున్నారు. సర్కారు పెద్దలు చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే.. కమిటీలో తమకు స్థానం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీని కూడా రద్దు చేసి, ‘కమిషన్ ఆఫ్ టెండర్స్’కే బాధ్యత అప్పగిస్తే సరిపోతుందనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది.