
మా వాటా పోస్టుల భర్తీకి మేం సిద్ధం
గ్రూప్-1 పెండింగ్ కేసుపై ఏపీ
నిర్ణయం తెలిపేందుకు రెండు వారాల గడువు కోరిన తెలంగాణ
మే 3కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించడంపై తమ వైఖరిని తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు తమకు రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించగా అందుకు సమ్మతిస్తూ మే మూడో తేదీకి విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించడం లేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను, ఇదివరకే మౌఖిక పరీక్షలు కూడా పూర్తయినందున ఫలితాలు ప్రకటించాలని దాఖలైన ఇతర పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కూడా విచారించింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రేతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్ష పునర్ నిర్వహణపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కోరింది. సోమవారం ఈ విషయాన్ని మరోసారి ధర్మాసనం ప్రస్తావించగా పరీక్షల నిర్వహణపై తమ వైఖరి వెల్లడించేందుకు మరో రెండు వారాల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును కోరింది. కాగా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కోటాలో వచ్చిన ఖాళీలను భర్తీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ న్యాయస్థానానికి నివేదించారు.
పూర్తి స్థాయి వాదనలు వినాలి
ఏపీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేసుకుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 పునర్ నిర్వహణకు ఉమ్మడి సర్వీసు కమిషన్ ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడిన ధర్మాసనం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సిలబస్‌లో వచ్చిన మార్పులపై ఆరా తీసింది. ‘రాష్ట్ర విభజన అనంతరం గ్రూప్-1 పరీక్షలో సిలబస్‌తో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును సైతం పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉంది..’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. విచారణను మే 3వ తేదీకి వాయిదా వేశారు. 2011లో ఏపీపీఎస్సీ 312 ఖాళీలను భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో తప్పులు దొర్లిన అంశంపై అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం పెండింగ్‌లో ఉండటంతో అభ్యర్థులు తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు.