
రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర శాసన సభా కార్యదర్శి, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజా సదారాం తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్ బూత్, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్‌లాల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సునిల్ కుమార్‌తో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు అయినా ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల నియమ నిబంధనలను తెలియజేశాం. వారికి వ్యక్తిగతంగానూ వివరాలను పంపించాం. ప్రాధాన్య ఓటు భారత ఎన్నికల కమిషన్ సమకూర్చిన పెన్నుతోనే ఎమ్మెల్యేలు తాము ఓటు వేయదల్చుకున్న అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. ఇది పూర్తిగా రహస్య పద్ధతిలో జరిగే ఎన్నిక. సభ్యులు తామేసిన ఓటును రహస్యంగానే ఉంచాలి’ అని రాజసదారాం తెలిపారు.