
రైతులతో ప్రధాని మోదీ ముఖాముఖి
ఔషధ, సుగంధ మొక్కల కేంద్రం(సీమ్యాప్) తమకు అందించిన సరి కొత్త వంగడాలతో లాభాలు గడిస్తున్నట్లు...
సాక్షి,హైదరాబాద్: ఔషధ, సుగంధ మొక్కల కేంద్రం(సీమ్యాప్) తమకు అందించిన సరి కొత్త వంగడాలతో లాభాలు గడిస్తున్నట్లు తెలంగాణ, ఏపీకి చెందిన రైతులు ప్రధాని మోదీకి తెలిపారు. సెంటర్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా సోమవారం ప్రధాని పలువురు రైతులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. రెండు రాష్ట్రాలకు చెందిన 200 మంది రైతులు పాల్గొన్నారు. పసుపు దిగుబడులు రెట్టింపు చేయగల సరికొత్త వంగడం ‘పీతాంబర్’ను ఇద్దరు రైతులకు అందించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
విశాఖపట్నం పాడేరుకు చెందిన బొంజుబాబు, కర్నూలు జిల్లా పొనకలదిన్నెకు చెందిన డి.గజేంద్రరెడ్డిలు ప్రధానితో సంభాషించారు. పీతాంబర్ పసుపును పరిచయం చేసిన తర్వాత లాభాలు గడించానని బొంజుబాబు చెప్పారు. అశ్వగంధ వంగడాన్ని పదెకరాల్లో పండిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నానని గజేంద్రరెడ్డి పేర్నొన్నారు. పంటలకు తగిన ధర లభిస్తోందా.. మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారని రైతులను ప్రధాని ప్రశ్నించారు. రైతులను ప్రధాని పేరుపేరున పలకరించారు. తెలుగులో నమస్కారం అని సంబోధించారు. కాగా, తెలంగాణ రైతులెవరికీ ప్రధానితో మాట్లాడే అవకాశం రాకపోవడంతో నిరాశ చెందారు.