పాతబస్తీలో రీపోలింగ్: ఆయనను దూరం పెట్టండి!
హైదరాబాద్: పాతబస్తీలోని పూరానాపూల్ డివిజన్‌లో శుక్రవారం జరగనున్న రీ పోలింగ్‌కు డీసీపీ సత్యనారాయణను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పూరానాపూల్‌లో మంగళవారం జరిగిన పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ డివిజన్‌లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే పోలింగ్ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ వ్యవహరించిన తీరుపైనా ఫిర్యాదులు రావడంతో ఎన్నికల విధులకు ఆయనను దూరం ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
52 డివిజన్ పూరానాపూల్లోని 36 పోలింగ్ బూత్లలో శుక్రవారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 225 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈ రీపోలింగ్ కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించి.. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫలితాలు ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.