30 వేల ప్రశ్నలతో క్వశ్చన్‌ బ్యాంక్‌! | Question Bank with 30,000 questions! | Sakshi
Sakshi News home page

30 వేల ప్రశ్నలతో క్వశ్చన్‌ బ్యాంక్‌!

Published Sat, Dec 30 2017 4:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Question Bank with 30,000 questions! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)ను నిర్వహించనున్న నేపథ్యంలో దాదాపు 30 వేల ప్రశ్నలతో ఎంసెట్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఇప్పటివరకు ఉన్న ఎంసెట్‌ పరీక్షా విధానం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటివరకు పరీక్షను ఒకే సమయంలో నిర్వహించినందున, వాటికి హాజరయ్యే విద్యార్థులందరికీ ఒకేరకమైన ప్రశ్నలను, జవాబుల ఆప్షన్లను జంబ్లింగ్‌ చేసి ఇచ్చేవారు. కానీ ఆన్‌లైన్‌లో పరీక్షల విధానం అందుకు భిన్నంగా ఉండనుంది. నాలుగు రోజుల పాటు 8 సెషన్లుగా నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. 

మిగతా పరీక్షల్లోనూ ఇదే విధానం.. 
అన్ని సబ్జెక్టులకు సంబంధించి నాలుగు స్థాయిలతో కూడిన ప్రశ్నలు దాదాపుగా 30 వేల వరకు రూపొందించాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పైగా అన్ని స్థాయిల ప్రశ్నలు విద్యార్థులందరికీ సమపాళ్లలో వచ్చేలా ప్రోగ్రాం రూపొందించి అమలు చేస్తారని పేర్కొన్నారు. ఇవి ఇంజనీరింగ్‌ ఎంసెట్‌కు, అగ్రికల్చర్‌ ఎంసెట్‌కు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇలా ఎంసెట్‌ తరహాలోనే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌కు క్వశ్చన్‌ బ్యాంక్‌లను రూపొందించి పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది.  

ఒక్కో సెషన్‌కు వేర్వేరు ప్రశ్నలు.. 
ఒక్కో సెషన్‌లో 25 వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పరీక్షలు రాస్తారు. కాబట్టి ఒక సెషన్‌లో వచ్చిన ప్రశ్నలు మరో సెషన్‌లో ఇవ్వరు. ఇలా 8 సెషన్లకు వేర్వేరుగా ప్రశ్నలు ఉంటాయి. అంతేకాదు ఒకే సెషన్‌లో పరీక్షలు రాసే 25 వేల మంది విద్యార్థులకు ఇచ్చే ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రాల్లోనూ ప్రశ్నల వరుసక్రమం మారిపోతుంది.

ఇందులో ప్రశ్నలు, జవాబుల ఆప్షన్లలో జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఎవరికి ఏ వరుస క్రమం వచ్చిందో పక్కనుండే విద్యార్థులకు తెలియదు. ఈ విధానంతో మాస్‌ కాపీయింగ్, హైటెక్‌ కాపీయింగ్, పేపర్‌ లీకేజీ వంటి తప్పిదాలు జరక్కుండా పూర్తిగా నియంత్రించవచ్చని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అయితే ఇందులోనూ పరీక్షల నిబంధనల ప్రకారం కఠిన, మధ్యస్త, సాధారణ, సులభతర ప్రశ్నలను రూపొందించనున్నారు. అంతేకాదు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నల నిష్పత్తిని అమలు చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement