నేనొస్తే వారి పప్పులుడకవు ...
నేను తెలంగాణలో సీఎం క్యాండిడేట్‌ని. చంద్రబాబుతో కలిసి జిల్లాలల్ల ఎన్నికల పర్యటనలు చేశా. బీసీ నేతగా నాకున్న ఇమేజ్ పార్టీకి ఉపయోగపడడం వల్ల ఏపీలో టీడీపీకి కలిసొచ్చింది. తెలంగాణలో ఓడిపోగానే చంద్రబాబుకు పార్టీ నాయకులు యాదికొచ్చిన్రు. సీఎంగా పనికొచ్చిన నాయకుడు ఫ్లోర్‌లీడర్‌గా పనికిరాడట. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనికిరాడట... మళ్లీ గదే రేవంత్, ఎర్రబెల్లి, రమణలు అవసరమైనరు... అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే.
బీసీ నాయకుడిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈయనను ఎన్నికల సమయంలో టీడీపీలో చేర్చుకొని శివారుల్లోని ఓ నియోజకవర్గం నుంచి టికెట్టు ఇచ్చిన చంద్రబాబు తెలంగాణలో ఘోర ఓటమి తరువాత సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దాంతో ఆయన కూడా ‘ నా ఉద్యమ జీవితం ముందు ఈ పార్టీ ఓ లెక్కా’ అని మళ్లీ బీసీల సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటానికే మొగ్గు చూపారు.
అంత వరకు బాగానే ఉన్నా... ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన పార్టీలో మళ్లీ తళుక్కుమన్నారు. బీసీ కార్డు అవసరమై పార్టీ నేతలే పిలిచారో... పార్టీ ధీనస్థితి చూసి జాలితో ఆయనే వచ్చారో తెలియదు గానీ డిసెంబర్ 12న నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రత్యక్షమై టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో టీడీపీ-బీజేపీలను భుజానికెత్తుకొని బీసీల పార్టీలు ఇవి రెండేనని మరోసారి చంద్రబాబు, బీజేపీ నేతల దృష్టిలో పడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఎల్.బి.నగర్‌లో తనను నమ్ముకున్న వాళ్లకు టికెట్లు ఇప్పించి, వారి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయినా తనకు తెలంగాణ నాయకత్వ బాధ్యతలు చూస్తున్న రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత అసంతృప్తితో ఉన్నారు. తానొస్తే వాళ్లు ఎక్కడ పలచన అవుతారో... బీసీ నేతగా తనకున్న ఇమేజ్ ముందు ఎక్కడ తేలిపోతామో ... అనే భయంతోనే పార్టీ కార్యక్రమాలకు రాకుండా దూరం పెడుతున్నారని తన సని్నిహ తులతో చెపుతున్నారీ బీసీ నేత.