
'బంగారంపై చట్టాలు చేయడం సరికాదు'
హైదరాబాద్ : బంగారంపై కేంద్రప్రభుత్వం చట్టం చేయడం సరికాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి అన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారం తల్లీ-బిడ్డల అనుబంధానికి ప్రతీక అన్నారు. మోదీ కన్ను మహిళల మంగళ సూత్రాలపై పడటం దురదృష్టకరమని రఘువీరా విమర్శించారు.
ప్రధాని మోదీ బంగారం జోలికి వస్తే భస్మం కాక తప్పదని జోస్యం చెప్పారు. మోదీ నగదు రహిత భారత్, బంగారు రహిత భారత్ అంటే ప్రజలు బీజేపీ రహిత భారత్ చేస్తారన్నారు. పిచ్చోడి చేతిలో రాయి..మోదీ, చంద్రబాబు చేతిలో పాలన ఒకటేనన్నారు. అవినీతిపై యుద్ధం అంటున్న మోదీ ఆయన ఎన్నికల ప్రచారానికి పెట్టిన రూ.5 వేల కోట్లు ఎలా వచ్చాయో లెక్కలు చూపాలన్నారు. పెద్ద నోట్ల రద్దుతో మోదీ కొండను తవ్వి ఎలుకను పట్టబోతున్నారని చెప్పారు. 100 రోజుల్లో నల్లధనం తెస్తామన్న హామీని దృష్టి మళ్లించేందుకే మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని రఘువీరా ఆరోపించారు.