
‘బాపు బదులు మోదీ చిత్రమా?’
విజయవాడ : ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ)-2017 క్యాలెండర్లపై మహాత్మాగాంధీ ఫొటోకు బదులు ప్రధాన మంత్రి మోదీ ఫొటో ముద్రించడంపై ఏపీసీసీ తీవ్రంగా స్పందించింది. దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని, కేవీఐసీ క్యాలెండర్లపై బాపూజీ ఫొటోను తిరిగి ముద్రించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జాతిపిత గాంధీజీ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రపన్నుతుందని మండిపడ్డారు. క్యాలెండర్, డైరీలపై ఫొటోల వ్యవహారంతో ప్రధాని మోదీ అసలు బండారం బయటపడిందన్నారు. గాంధీని చంపిన గాడ్సేకు వారసులని... బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ చర్యల ద్వారా మరోసారి రుజువు చేశాయని పేర్కొన్నారు. ఈ అసాధారణ నిర్ణయం వెనుక బీజేపీ పెద్దల ప్రమేయముందని రఘువీరా పేర్కొన్నారు.