
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సంగారెడ్డిలో జూన్ 1న నిర్వహించబోయే సభను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టా త్మకంగా తీసుకుంది.
► జూన్ 1న సంగారెడ్డిలో నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం
► ఏర్పాట్లపై ఉత్తమ్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సంగారెడ్డిలో జూన్ 1న నిర్వహించబోయే సభను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. తెలంగాణ ఏర్పాటై మూడేళ్లవు తున్న సందర్భంగా జరుగుతున్న ఈ సభను.. వచ్చే ఎన్నికలకు సన్నాహక కార్యక్రమంగా నిర్వహించనుం ది. ఇందుకోసం విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తోంది. సభకు భారీగా జన సమీకరణ చేయాలని, ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఉండాలని నిర్ణయించింది.
ఇదే సరైన సమయం...
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ నిర్వహ ణకు సంబంధించి బుధవారం ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ఎన్ని కలకు రెండేళ్లు ఉండగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తున్న విషయాన్ని ఆయ నకు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో రైతులపై కేసులు, బేడీలు వేయడం, రుణమాఫీలో వైఫల్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు (ఎస్టీలకు, ముస్లింలకు), కేజీ టు పీజీ వంటి కీలకమైన హామీల్లో ప్రభుత్వ విఫలమైందని చెప్పారు.
ధర్నాచౌక్ ఎత్తివేతపై రాష్ట్రం లో ప్రజాతంత్ర వాదులు, మేధావులు, విద్యావం తులు, ప్రజాస్వామికవాదులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ఈ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని వివరించారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా.. భారీ కార్యక్రమాలను చేపట్టలేదని పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందన్నారు. అందువల్ల సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి హాజ రైతే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్టు అవుతుం దని రాహుల్‌ని ఉత్తమ్ కోరారు. ఈ ప్రతిపాదనకు రాహుల్‌గాంధీ అంగీకరించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
భారీగా జన సమీకరణ.. ర్యాలీ
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీపీసీసీ చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని ఎన్నికలకు సన్నాహ కసభగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. సంగారెడ్డిలో బహిరంగసభకు ముందు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి దాకా దాదాపు 45 కిలోమీటర్ల మేర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయిం చింది. సంగారెడ్డిలో సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై మెదక్‌జిల్లా నేతలతో ఉత్తమ్ సమావేశమ య్యి, ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పగించారు. భారీ జన సమీకరణతో టీఆర్‌ఎస్‌కు గట్టి సందేశం ఇస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు.