హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నూతన డెరైక్టర్‌గా డాక్టర్ రాకేశ్ మిశ్రా గురువారం బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ సీహెచ్ మోహనరావు పదవీ విరమణ (జనవరి 30, 2016) తరువాత సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అమిత్ ఛటోపాధ్యాయ మూడు నెలలపాటు యాక్టింగ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. తాజాగా డాక్టర్ రాకేశ్ మిశ్రా డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పట్టాలు పొందిన రాకేశ్ మిశ్రా ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్‌లో కొద్ది సమయం పనిచేశారు.
ఫ్రాన్స్, అమెరికా, స్విట్జర్లాండ్‌లలోని వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ డాక్టరల్ స్టడీస్ ముగించుకున్న తరువాత 2001లో సీసీఎంబీలో చేరారు.వివిధ జర్నల్స్‌లో వందకుపైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించిన ఈ సీనియర్ శాస్త్రవేత్త జన్యుక్రమ వ్యవస్థలో పరిణామ క్రమంలోనూ భద్రంగా ఉన్న అంశాలపై ఆసక్తి మెండు. దీంతోపాటు క్రొమాటిన్ నిర్మాణం, పిండదశలో జన్యువుల నియంత్రణ వ్యవహారం తదితర అంశాలపై పరిశోధనలు చేస్తూంటారు. సీసీఎంబీ కొత్త డెరైక్టర్‌గా శాస్త్రీయ విజ్ఞానం సమాజ హితానికి మరింత ఎక్కువగా ఉపయోగపడేలా చేయడం తన లక్ష్యమని డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.