
‘స్విస్ చాలెంజ్’పై సమాధానమేదీ? : రామచంద్రయ్య
సీఎం చంద్రబాబుకు రామచంద్రయ్య ప్రశ్న
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టడంపై ప్రశ్నించిన విపక్షాలు, మేధావులు, ప్రజా సంఘాలను ఉన్మాదులుగా అభివర్ణించిన సీఎం చంద్రబాబునాయుడు.. అమరావతిని రహస్యంగా చేపట్టడం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించడంపై ఏమంటారని శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య నిలదీశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు ప్రజలు తనకు సీఎం పదవి అనే లెసైన్స్ ఇచ్చారని భావించడం మంచిది కాదని చంద్రబాబుకు గురువారం ఓ ప్రకటనలో ఆయన హితవు పలికారు.
రాజధాని నిర్మాణంపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఈ అక్రమ విధానాలకు వంత పాడలేక ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారని వివరించారు.