114 వాహనాలు ‘రీ’ రికవరీ
ఐదుగురిపై వేటు పడే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో అక్రమాలపై ఎట్టకేలకు కదలికవచ్చింది. సీసీఎస్‌లో జరుగుతున్న అక్రమ బాగోతాలపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. చీటింగ్ కేసు నుంచి 16 మంది నిందితులను తప్పించిన తాజా కథనంపై కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో సదరు శాఖకు చెందిన ఐదురుగురు అధికారులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు సీసీఎస్ డీసీపీ రవివర్మ క్రైమ్ నెంబర్ 289/2014 ఫైల్‌ను తిరగదోడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కేసు దర్యాప్తు అధికారిని పిలిపించి విచారించారు. పోలీసులు తప్పించిన నిందితుల్లో ఓ రౌడీషీటర్ కూడా ఉండడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఒకపక్క వాహనాలను ఇష్టం వచ్చినట్లు పంచుకోవడం, మరోపక్క గుట్టుచప్పుడు కాకుండా ఫైనాన్స్ కంపెనీలకు తరలించడంపై ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా సీసీఎస్‌లోని ఆయా కేసులకు సంబందించిన ఫైళ్లను స్వాధీనం చేసుకోవడమేగాకుండా అక్రమంగా తరలిపోయిన సుమారు 114 వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక అలీషా కేసులో రాకేష్‌రెడ్డికి చెందిన కేఏ 02 ఎంఏ 9311 బొలెరో వాహనాన్ని గత డిసెంబర్‌లో సీజ్ చేసిన సీసీఎస్ ఆటోమొబైల్ టీం అధికారులు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కు కానుకగా ఇచ్చినట్లు తాజాగా చేపట్టిన విచారణలో వెలుగులోకి వచ్చింది.
వేటుకు రంగం సిద్ధం...
అక్రమాలకు పాల్పడిన సీసీఎస్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్‌ఐ తదితరులపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. ఆయా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి కావడంతో వారిపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్రమంగా వాహనాలను తీసుకెళ్లిన ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు గల అకాశాలపై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. పై నలుగురు అధికారులే కాకుండా మరో ఇద్దరు అధికారుల వద్ద ఉన్న వాహనాలను కూడా సీజ్ చేసినట్లు సమాచారం.
పంపకాలపై విచారణ షురూ..!
Published Sun, Apr 19 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement