
లంచానికి రసీదు
⇒ ‘కలెక్టర్ల’ను బదిలీ చేసినా పోలీసు శాఖలో ఆగని కలెక్షన్లు
⇒ తాజాగా లంగర్‌హౌస్ మార్కెట్‌లో ఖాకీ వసూళ్లు
⇒ హాక్-ఐకి అందిన ఫిర్యాదు
⇒ విచారణ చేపట్టిన కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నీళ్ల వ్యాపారి నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ అడుగు ముందుకేసి తాను తీసుకున్న లంచానికి సరిపడ రసీదును సైతం ఇచ్చాడు.
ఈ రసీదు హాక్-ఐ ద్వారా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి చేరింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... పోలీసు స్టేషన్ ఏరియాలో నెలవారీ మామూళ్లకు చరమగీతం పాడేందుకు నగర పోలీసు కమిషనర్ గత నెల ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్‌లకు చెందిన 80 మంది కలెక్టర్ల(కలెక్షన్ విధులు నిర్వహించే కానిస్టేబుల్)లపై బదిలీ వేటు వేశారు. ఇక నుంచి ఎవరైనా మామూళ్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు సిబ్బందిని, అటు స్టేషన్ అధికారైన ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆదేశాలు జారీ అయిన వారం రోజుల వ్యవధిలోనే టోలిచౌకీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ గత నెల 27న ఓ కూరగాయల వ్యాపారి, నీళ్ల వ్యాపారి నుంచి రూ.300 తీసుకుని అందుకు రసీ దు కూడా ఇచ్చాడు. ఈ రసీదు కాపీని సదరు వ్యాపారులు హాక్-ఐ ద్వారా పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కమిషనర్ విచారణకు ఆదేశించారు.
యాప్‌కు విశేష స్పందన...
జనవరి 1న పోలీసులు అందుబాటులోకి తెచ్చిన హాక్-ఐ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా ఎక్కువ ఫిర్యాదులు ట్రాఫిక్ ఉల్లంఘనలు,, మహిళలపై వేధింపులు, పోలీసులపైనే ఉన్నాయి. గత రెండున్నర నెలల్లో సెంట్రల్ జోన్ నుంచి 327, ఈస్ట్‌జోన్ నుంచి 106, నార్త్‌జోన్ నుంచి 105, సౌత్‌జోన్ నుంచి 79, వెస్ట్‌జోన్ నుంచి 194 ఫిర్యాదులు హాక్-ఐ ద్వారా వచ్చాయి. ఇందులో ట్రాఫిక్ ఉల్లంఘనపై 386, జరుగుతున్ననేరాలపై 215, మహిళలపై వేధింపులు 96, పోలీసులపై ఫిర్యాదులు 52, పోలీసులు చేసిన మంచి పనిపై 62లు వచ్చాయి.
అవినీతి అంతానికి హాక్-ఐ మంచి ఆయుధం...
పోలీసు శాఖలో అవినీతిని ప్రక్షాళనకు ప్రజల సహకారం ఉండాలి. ఈ ఏడాది మొదట్లో నగర పోలీసులు ప్రాంరభించిన ‘హాక్-ఐ’ (డేగకన్ను) యాప్ ప్రజలకు ఆయుధంగా మారింది. . ప్రతి పౌరుడు పోలీసే అనే నినాదంగా ఈ యాప్ ఉపయోగపడుతోంది. హాక్-ఐకి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే దర్యాప్తు చేపట్టడం ద్వారా ఫిర్యాదుదారులే పోలీసు శాఖకు బాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు.