గస్తీ సిబ్బందికి ‘నేర’ పరీక్ష
పాత నేరస్తులపై నిత్యం నిఘా
క్షేత్రస్థాయి సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యత
నగరంలోని ఎంఓ క్రిమినల్స్ జాబితా సిద్ధం
నేరస్తుల వివరాలు అప్‌డేట్
వచ్చే వారం నుంచి ఆకస్మిక తనిఖీలు
రోటీన్‌గా సాగిపోతున్న గస్తీ విధానాలను సమగ్రంగా మార్చడానికి నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే ఎంఓ క్రిమినల్స్‌ను పర్యవేక్షించే బాధ్యతల్ని బ్లూకోల్ట్స్, రక్షక్‌లకు అప్పగించారు. వచ్చేవారం నుంచి ఆకస్మిక తనిఖీల ద్వారా వీరి పనితీరును పరీక్షించాలని కొత్వాల్ నిర్ణయించారు. మంగళవారం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన కొన్నేళ్ల గణాంకాలు, నేరాలను విశ్లేషిస్తే అధిక శాతం పాతవారి ‘పని’గానే తేలింది. వీరిపై కన్నేసి ఉంచితే నేర నిరోధం సాధ్యమని ఉన్నతాధికారులు భావించారు. దీనికోసం ‘ఎంఓ క్రిమినల్స్ డేటాబేస్’ రూపొందించారు. - సాక్షి, సిటీబ్యూరో
ఠాణాల వారీగా వివరాలు..
నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన దశాబ్ద కాలంలో 50 వేలకు పైగా నేరగాళ్లు అరెస్టయ్యారు. వీరిలో దాదాపు 30 వేల మంది పదేపదే ఒకే తరహా నేరాలు చేసి చిక్కిన వారున్నారు. పోలీసు పరిభాషలో వీరిని ‘ఎంఓ క్రిమినల్స్’గా పరిగణిస్తారు. వీరికి సంబంధించి సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్‌బీ)లో డేటాబేస్ రూపొందింది. దీనిపై దృష్టి పెట్టిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి నేరగాళ్లపై నిఘాకు దాన్నే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ 30 వేల మంది వివరాలను విశ్లేషించి వారు నివసిస్తున్న ప్రాంతాల వారీగా జాబితా రూపొందించి వాటిని క్షేత్రస్థాయిలోని రక్షక్, బ్లూకోల్డ్స్ సిబ్బందికి అందించారు.
నిత్యం ‘సందర్శించాల్సిందే’..
ఠాణాల వారీగా గస్తీ తిరిగే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బంది ఇకపై నిత్యం కచ్చితంగా తమ పరిధిలోని ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లాల్సిందేనని కొత్వాల్ స్పష్టం చేశారు. ఆ నేరగాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అతడి జీవన సరళి.. కదలికల వివరాలు సేకరించడంతో పాటు సమీపంలో ఉండే బంధువులు, స్నేహితుల ఇళ్లకూ వెళ్లి ఆరా తీయాలని ఆదేశించారు. 30 వేల ఎంఓ క్రిమినల్స్ వివరాలను జోనల్, నేరం ప్రాతిపదిన విడిగా ప్రత్యేక జాబితాలు రూపొందించారు.
వచ్చే వారం నుంచి ఆకస్మిక తనిఖీలు
ఎంఓ నేరగాళ్లపై నిఘా కోసం తెరిచే సస్పెక్ట్ షీట్స్ సాధారణంగా వారు నివసిస్తున్న ప్రాంతం పరిధిలోని ఠాణాలో ఉంటాయి. అయితే, కొందరు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేయట్లేదు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఇతడి విషయం తెలియట్లేదు. ఎంఓ క్రిమినల్స్ డేటా అప్‌డేట్ చేస్తున్న అధికారులు ఇలాంటివి గుర్తించినపుడు ఆయా షీట్స్‌ను పాత నేరగాళ్లు పంజా విసురుతున్న ప్రాంతాల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నారు. గస్తీ సిబ్బంది బీట్ల వారీగా తమ ప్రాంతంలో నివసిస్తున్న అందరి నేరగాళ్లను ‘సందర్శించడానికి’ ఉన్నతాధికారులు వారం రోజుల గడువిచ్చారు. ఆ తరవాత కొత్వాల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు ఎవరైనా హఠాత్తుగా ఓ గస్తీ బృందం దగ్గరకు వెళ్లి జాబితాలోని ఓ నేరగాడి ఇంటికి తీసుకెళ్లమనో, అతడి ప్రస్తుత వ్యవహారాలు చెప్పమనో కోరతారు. ఇందులో విఫలమైన వారిపై చర్యలు తప్పవని కొత్వాల్ హెచ్చరించారు.
చిరునామా మారితే అప్‌డేట్..
ఈ నిందితుల్ని ఒక్కోసారి ఒక్కో ఠాణా అధికారులు అరెస్టు చేస్తుంటారు. అలా అరెస్టయిన సందర్భంలో వీరు పేర్లు, చిరునామాలు మార్చి చెప్తుంటారు. ఈ లోపాన్ని సరిచేయడానికి రికార్డుల్లో ఉన్న చిరునామాలో సదరు పాత నేరగాడు లేకుంటే.. ఆ విషయాన్ని అధికారులకు తెలిపి స్థానిక పోలీసుల సాయంతో కొత్త చిరునామా గుర్తించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిదే. చిరునామా సరైనదై, ఆ నేరగాడు వరుసగా కొన్ని రోజుల పాటు అందుబాటులో లేకుంటే ఇప్పటికీ నేరాలు చేస్తున్నట్లు అనుమానించి ప్రత్యేక జాబితాలో చేర్చి దర్యాప్తు చేపడతారు.