ఉద్యోగుల సాధారణ బదిలీలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఉద్యోగ సంఘాల వరుస విజ్ఞప్తులతో ఈ నెలాఖరున సాధారణ బదిలీలు చేపట్టాలని...
సీఎంకు చేరిన బదిలీల ఫైలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఉద్యోగ సంఘాల వరుస విజ్ఞప్తులతో ఈ నెలాఖరున సాధారణ బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ముఖ్యమంత్రికి పంపించారు. సీఎం ఆమోద ముద్ర పడితే ఈ నెల 25వ తేదీ నుంచి సాధారణ బదిలీలు మొదలవుతాయి. 15 రోజుల పాటు అన్ని శాఖల్లో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపడుతారు.
కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని 25వ తేదీ నుంచి జూన్ 11 వరకు సడలించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఒకేచోట కనీసం రెండేళ్లకు మిం చి పని చేసిన ఉద్యోగులకు బదిలీ అవకాశమివ్వాలని, అయిదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, అన్ని శాఖల్లో బదిలీల సంఖ్య 20 శాతం మించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
గత ఏడాది మే నెలలోనూ ఆర్థిక శాఖ సాధారణ బదిలీల ఫైలును సీఎంకు పంపించటం.. అక్కడ తిరస్కరణకు గురవటంతో ఈ ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ఈసారి సీఎస్ ఈ ఫైలును పంపించాలని ఆర్థిక శాఖను కోరటంతో బదిలీల ప్రక్రియ మొదలవుతుందని ఉద్యోగులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ రెండో తేదీన కొత్త జిల్లాలను ప్రకటించేందుకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ సమయంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులవద్ద అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
సాధారణ బదిలీలపై సీఎం ఇప్పటికే అయిష్టంగా ఉన్నారు. గతేడాది ఉపాధ్యాయుల బదిలీలకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని, రాష్ట్రంలో ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని ఇటీవల తనను కలిసిన టీఎన్‌జీవో నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో బదిలీల ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతోంది. ‘ముఖ్యమంత్రి ఆమోద ముద్ర పడి తే జూన్ ఒకటో తేదీ లోగా సాధారణ బదిలీలు మొదలవుతాయి.. లేకుంటే అక్టోబర్‌లో బదిలీలు జరిగే అవకాశం ఉంది...’ అని టీఎన్‌జీవో నేత దేవిప్రసాద్ పేర్కొన్నారు.