ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసిన మూడు కీలక నిర్ణయాలపై ఉత్తర్వులు ఈ వారంలో వెలువడుతున్నాయి.
ఉద్యోగులకు సంబంధించిన మూడు కీలక నిర్ణయాలపై త్వరలోనే ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చేసిన మూడు కీలక నిర్ణయాలపై ఉత్తర్వులు ఈ వారంలో వెలువడుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు డీఏ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. కొన్ని సాంకేతిక అంశాల పరిష్కారం తరువాత అధికారులు ఉత్తర్వులు విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ యాక్ట్ 1994 (యాక్ట్2-94)ను తెలంగాణకు అన్వయించుకుంది. ఈ చట్టానికి 10ఏ నిబంధనను చేరుస్తూ మంత్రి మండలి సవరించింది. ఈ చట్టం ప్రకారం పుల్ టైం బేసిస్‌లో ఐదేళ్లు, టెంపరరీ బేసిస్‌లో పదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు వీలవుతుంది.
ఔట్ సోర్సింగ్ జీతాల పెంపుపై త్వరలో ఆదేశాలు
అటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాల పెంపు నిర్ణయంపై కూడా త్వరలోనే ఆదేశాలు రానున్నాయి. వీలైనంత ఎక్కువమందికి జీతాలు పెరిగేలా ప్రభుత్వం నాలుగో స్లాబ్‌ను కూడా ప్రవేశ పెట్టడానికి కసరత్తు చేస్తోంది. మొత్తం 40వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వాళ్లకు అందుతున్న జీతాల ఆధారంగా నాలుగు స్లాబ్‌ల్లో లిస్ట్ అవుట్ చేస్తున్నారు. రూ. 6,500 నెలసరి జీతం పొందే వాళ్లకు రూ. 12,000, రూ. 8,400 నెలసరి జీతం పొందేవాళ్లకు రూ. 15,000, రూ. 10,900 నెలసరి జీతం పొందే వాళ్లకు రూ. 17,000 వరకు మూడు స్లాబుల్లో జీతాలు పెరగనున్న విషయం తెలిసిందే. ఐతే 40 నుంచి 50 శాతం జీతం పెరిగే విధంగా ఆర్థికశాఖ అధికారులు నాలుగో స్లాబ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు పంపారు. అక్కణ్నుంచి దస్త్రం సీఎంకు వెళ్లి ఆయన ఆమోదంతో తిరిగి వస్తుంది. తర్వాత ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇటు ఉద్యోగుల డీఏను సైతం 3.14 శాతానికి పెంచుతూ కేబినెట్ నిర్ణయం చేసింది. ఆ ఫైలుపై సీఎం సంతకం కాగానే ఆదేశాలు వెలువడనున్నాయి.