మట్టి పోరల్లో మహా చరిత్ర | Research to invent of telangana history | Sakshi
Sakshi News home page

మట్టి పోరల్లో మహా చరిత్ర

Published Wed, Jul 13 2016 3:51 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

మట్టి పోరల్లో మహా చరిత్ర

మట్టి పోరల్లో మహా చరిత్ర

- తెలంగాణ చరిత్రపై మహాన్వేషణ
- తొలిసారి భారీ పురావస్తు పరిశోధనలకు రాష్ట్ర సర్కారు నిర్ణయం.. శాతవాహనుల రాజధాని నగరం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం
- కరీంనగర్ జిల్లా కోటిలింగాల, ఆదిలాబాద్ జిల్లా కర్ణమామిడిలో తవ్వకాలకు సిద్ధం
- అనుమతి కోసం కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదన.. వంద ఎకరాల రాజధాని నగరాన్ని గుర్తించిన పురావస్తు శాఖ
- తెలుగు జాతి బీజాలపై  సంపూర్ణ స్పష్టత దిశగా అడుగులు

 
 సాక్షి, హైదరాబాద్: తెలుగు జాతికి మూలం ఎక్కడ?  తెలంగాణ గడ్డ మీద శతాబ్దాల పాటు వర్ధిల్లిన రాజవంశం ఏది? ఈ ప్రశ్నలకు చరిత్రకారులు ఠక్కున చెప్పే సమాధానం శాతవాహనులు అని! క్రీ.పూ.మూడో శతాబ్దంలో పరిఢవిల్లిన ఈ మహాసామ్రాజ్యానికి రాజధాని ఏది అంటే మరో ఆలోచన లేకుండా చెప్పే సమాధానం కోటిలింగాల!!
 
 కానీ చరిత్ర ఇంతేనా..? వెలుగు చూడని నిజాలు ఇంకేమైనా ఉన్నాయా? తెలుగు, తెలంగాణ చరిత్రకు కొత్త భాష్యం చెప్పే వాస్తవాల జాడలు మట్టిపొరల్లో దాగి ఉన్నాయా? తెలంగాణ ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ గడ్డను ఆధారం చేసుకుని దేశాన్ని మలుపుతిప్పిన చ రిత్ర జాడల కోసం అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ చరిత్రలో ఓ భారీ పురావస్తు అన్వేషణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపింది. అక్కడ్నుంచి అనుమతి రాగానే అన్వేషణ మొదలుకానుంది. తెలంగాణ చరిత్ర, తెలుగు జాతి మూలంపై మరింత స్పష్టత రానుంది.
 
 గోదావరికి అటూ... ఇటూ!
 కోటిలింగాల.. తెలంగాణ గడ్డ మీద వెలసిన తొలి మహా సామ్రాజ్యపు రాజధాని నగరం. భారతదేశంలో మూడో వంతు భాగాన్ని అప్రతిహతంగా దాదాపు మూడు శతాబ్దాలపాటు ఏలిన శాతవాహన సామ్రాజ్య కేంద్రబిందువు. అలనాటి మహానగరం ఇప్పుడు ఓ కుగ్రామం. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరు మండలం పరిధిలో గోదావరి నదీ తీరంలో ఉందా గ్రామం. ఈ పల్లెటూరు శివారులోని భూగర్భంలో అలనాటి గొప్ప సామ్రాజ్య రాజధాని విశ్రాంతి తీసుకుంటోంది. ఇది గతించిన చరిత్ర. ఇప్పుడు ఆ రాజధాని నగర జాడలను పూర్తిగా వెలుగులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు వంద ఎకరాల స్థలంలో తవ్వకాలు జరపబోతోంది. నాడు రాజధాని నగరంగా వెలిగిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు రైతుల పొలాలుగా ఉన్నాయి. వాటిని సేకరించి పూర్తిస్థాయిలో తవ్వకాలు జరిపే బృహత్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక.. గోదావరి నదికి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న మరో కుగ్రా మం కర్ణమామిడి. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్నందున ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వం భూసేకరణ చేసి పెట్టింది. అక్కడ కూడా తవ్వకాలు జరపాలని నిర్ణయించింది. వీటికోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉన్నందున రాష్ట్రప్రభుత్వం ‘సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అన్ ఆర్కియాలజీ(కాబా)’కి ప్రతిపాదన పంపింది. గోదావరికి అటూ.. ఇటూ.. తవ్వకాలు జ రిపేందుకు రంగం సిద్ధం చేసింది.
 
 ప్రయోజనం ఏంటి?
 కోటిలింగాల ప్రాంతం గొప్ప చరిత్రకు సాక్ష్యమనే విషయం 1978 వరకు పుస్తకాలకే పరిమితం. అప్పట్లో పురావస్తు నిపుణులు పరబ్రహ్మశాస్త్రి ఆధ్వర్యంలో తొలిసారి తవ్వకాలు జరిపారు. అప్పటికిగాని అది భారతదేశ చరిత్రల్లో అత్యద్భుతంగా విలసిల్లిన మహాసామ్రాజ్యానికి రాజధాని అని తెలిసిరాలేదు. ఇక్కడే  రెండున్నర వేలకుపైగా నాణేలు, గాజు వస్తువులు, పాత్రలు, నేరస్తులను శిక్షించే కేంద్రాలు, గొప్ప నిర్మాణ ఆనవాళ్లు వెలుగుచూశాయి. క్రీ.పూ.మూడో శతాబ్దంలో శాతవాహన తొలి చక్రవర్తి చిముకుడి హయాం నాటి నాణేలు ఇక్కడ తప్ప ఇప్పటివరకు మరే ప్రాంతంలో వెలుగుచూడలేదు. 1978 నుంచి 1983 వరకు జరిగిన తవ్వకాల ఫలితంగా... కోటిలింగాలలో వంద ఎకరాల సువిశాల నగరం ఉన్నట్టు తేలింది. దాని చుట్టూ రాజప్రాకారం, 4 మూలలా బురుజులు, వాచ్ టవర్, పెద్ద గోపుర ద్వారం ఉన్నట్టు స్పష్టమైంది. కానీ అవి పూర్తిగా వ్యవసాయ భూములు కావటంతో అంతకంటే ఎక్కువగా తవ్వలేకపోయారు. నగరం విస్తరించిన ప్రాంతంలో ఒక శాతం భూమిలో మాత్రమే తవ్వకాలు జరిపినట్టు అప్పట్లో పరబ్రహ్మశాస్త్రి వెల్లడించారు.
 
 దాని ఆధారంగానే తెలంగాణ చరిత్ర మూలాల్లో కొంత స్పష్టత తెచ్చారు. ఇప్పుడు పూర్తిగా దాన్ని తేల్చి చెప్పేందుకు వంద ఎకరాల్లో  తవ్వకాలు జరపబోతున్నారు. ఆవలివైపు ఉన్న కర్ణమామిడి ప్రాంతంలో శాతవాహన కాలానికి ముందు చిన్నచిన్న రాజ్యాలుగా పాలన సాగించిన మహాజనపధ-16 కాలాల నాటి నాణేలు పొలాలు దున్నుతుంటే బయటపడ్డాయి.   దీంతో అక్కడ కూడా తవ్వకాలు జరిపి తెలంగాణ మూలాల్లో మరింత స్పష్టత కోసం  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చరిత్రను  వెలుగులోకి తెచ్చి చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించి నేటి, భావి తరాలకు తెలంగాణ మూలాలైపై అవగాహన తెచ్చే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
 
 వారికున్న శ్రద్ధ మనకేదీ?
 ఆక్స్‌ఫర్డ్, ప్రిన్‌స్టన్ వర్సిటీలు గతంలోనే ప్రపంచ చరిత్ర పటాన్ని సమగ్రంగా వెలుగులోకి తెచ్చా యి. 5 వేల ఏళ్ల చరిత్రను ఆలంబనగా చేసుకుని వెల్లడించిన ఆ సమాచారం ప్రకారం.. భార త్‌లో మూడో వంతు భాగాన్ని 3 శతాబ్దాలపాటు  ఏలిన సామ్రాజ్యం శాతవాహన కాలమని పొందుపరిచారు. అలాగే నాగ్‌పూర్ వర్సిటీలో ప్రపంచ చరిత్రకారుల సదస్సు జరిగిన సందర్భంలో 1972లో శాతవాహనుల పాలనాదక్షతను వెల్లడించారు. ప్రపంచంలో రెండు సామ్రాజ్యాల హయాంలో శాంతిసామరస్యాలు గొప్పగా పరిఢవిల్లాయన్నారు.
 
 హరప్ప-మొహంజదారో నాగరికత కాలంలో తొలిసారి ఆ తర్వాత శాతవాహనుల కాలంలో రెండోసారి శాంతిసామరస్యాలు వెల్లివిరిశాయని తేల్చి చెప్పారు. ఇంతగొప్ప చరిత్రకు తెలంగాణ గడ్డ సాక్షీభూతంగా నిలిచినా.. ఆ సామ్రాజ్య రాజధాని జాడలను వెలుగులోకి తేవటం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పు డు పూర్తిస్థాయిలో తవ్వకాలు జరిపి ఆ మహా సామ్రాజ్య రాజధానిని వెలుగులోకి తెచ్చి, పరిరక్షణ చర్యలు తీసుకుని, పర్యాటకులకు అందుబాటులోకి తె చ్చేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement