బతుకమ్మ చీరలది 150 కోట్ల కుంభకోణం
న్యాయ విచారణ జరపాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల పేరుతో కనీసం 150 కోట్ల కుంభకోణానికి టీఆర్‌ఎస్ నేతలు పాల్పడ్డారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు విజయరమణారావు, వేం నరేందర్‌రెడ్డితో కలిసి సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సూరత్‌లో కిలోకు 250 రూపాయల చొప్పున చీరెలను కొనుగోలు చేశారని చెప్పారు. కిలోకు ఆరు పాలిస్టర్ చీరలు వస్తాయని సూరత్‌లోని బట్టల వ్యాపారస్తులు చెప్పినట్టుగా వివరించారు.
సిరిసిల్లకు చెందిన ఇద్దరు టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఈ కొనుగోళ్లు చేసినట్టుగా సూరత్ వ్యాపారస్తుల ద్వారా తెలిసిందన్నారు. సొంత నియోజకవర్గమైన సిరిసిల్లకు చెందిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చేసిన ఈ కొనుగోళ్ల వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌కు భాగస్వామ్యం ఉందా లేదా అన్నది తేల్చడానికి న్యాయ విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో రీడిజైనింగ్, వాటర్‌గ్రిడ్ పైపుల కొనుగోళ్లు, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కాంట్రాక్టులు, ఇసుక క్వారీలతోపాటు పేద మహిళలకు పంచిన చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.