
అప్పులు, దోపిడీలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ ఓటమి ఖాయం: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
కైలాస్‌నగర్: రాష్ట్రంలో పాలకులు మాత్రమే మారారు.. పాలన తీరు ఏ మాత్రం మారలేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అప్పులు, ఆర్థిక దోపిడీలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలన తీరుపై ధ్వజమెత్తారు.
బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ మాటలు కోటలు దాటగా, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు సచివాలయ గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారనే కార్యాచరణ కూడా ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి తమ అసమర్థపాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారం చేశారని ఆరోపించారు. 14 నెలల పాలనలోనే ఈ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా అమలు చేయని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పాలనపై బహిరంగచర్చకు రావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ పాలనను విమర్శించే అర్హత రేవంత్, రాహుల్‌గాంధీలకు లేదని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.
అయితే దీనిని అమలు చేయకుండా కేంద్రంపై నెపం మోపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment