మోగిన బడి గంట.. | Ring of school bell | Sakshi
Sakshi News home page

మోగిన బడి గంట..

Published Mon, Jun 13 2016 3:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

మోగిన బడి గంట..

మోగిన బడి గంట..

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవులను ముగించుకొని బడులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తల్లిదండ్రులకు ఫీజుల గోల.. విద్యార్థులకు బ్యాగుల బరువు మళ్లీ మొదలు కాబోతోంది. సర్కారు బడులు సమస్యలతోనే విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ఏకంగా 300 స్కూళ్లలో టీచర్లే లేరని విద్యా శాఖనే లెక్కలు వేసిన నేపథ్యంలో.. మరి బడులు తెరిచేదెవ రన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముందుగా బడికి వెళ్లిన విద్యార్థులే గంట మోగించాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూళ్లు తెరిచే నాటికల్లా విద్యా వలంటీర్లను నియమించి పాఠశాలలను తెరిపించాలని విద్యా శాఖ భావించినా అది సాధ్యం కాలేదు. విషయాన్ని శుక్రవారమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. శని, ఆదివారాలు సెలవు కావడంతో వలంటీర్లను నియమించలేదు.

మరోవైపు చాలా పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే ప్రారంభం కానుండగా, మరిన్ని పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకుండానే బోధన ప్రారంభం కానుంది. వారం రోజుల్లో స్కూల్ ఫీజులు, నియంత్రణ విధానాన్ని ప్రకటిస్తామని గత ఏప్రిల్ 11న ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా విద్యా శాఖ ఫీజుల నియంత్రణను పక్కాగా చేపట్టలేకపోయింది. పట్టింపులేని అధికారులు, పట్టించుకోని ప్రభుత్వం కారణంగా తల్లిదండ్రులు భారీ మొత్తంలో పెరిగిన ఫీజులను తప్పని పరిస్థితుల్లో చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇక కొంతమంది టీచర్లయితే విద్యార్థులు లేకపోయినా బడులకు వెళ్లనున్నారు.

405 పాఠశాలల్లో విద్యార్థులు లేరని విద్యాశాఖ లెక్కల ప్రకారమే తేలింది. అందులో పనిచేసే టీచర్లు బడిబాటలో చేరే విద్యార్థులకు బోధిం చేందుకు వెళ్లనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాలల్లో రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బోధనాంశాలతో కూడిన కేలండర్‌ను సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపింది. అయితే అది ఇంకా పాఠశాలల స్థాయిలో టీచర్లకు చేరనేలేదు. ఇక 1.68 కోట్ల పుస్తకాలను పాఠశాలలకు పంపామని అధికారులు చెబుతున్నా.. 30 శాతం పుస్తకాలు కూడా విద్యార్థులకు అందలేదని క్షేత్ర స్థాయిలో అధికారులే చెబుతున్నారు. చాలా స్కూళ్లల్లో ఒక్కో తరగతికి సంబంధించిన పుస్తకాలు తెలుగు వస్తే ఇంగ్లిషు రాలేదు. ఇంగ్లిషు అందితే సోషల్ సైన్సు వంటి పుస్తకాలు అంద లేదని వెల్లడించారు.

 సమస్యల స్వాగతం
 రాష్ట్రంలో మొత్తం 28,707 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 6,685 స్కూళ్లలో కామన్ టాయిలెట్స్ లేవు. 2,116 స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేవు. మరో 5,742 స్కూళ్లలో బాలురకు టాయిలెట్లు లేవు. నీటి సరఫరా లేకపోవడంతో ఉన్న టాయిలెట్లు వినియోగించడానికి వీల్లేనివిగా తయారయ్యాయి. 6,974 స్కూళ్లలో తాగునీటి సదుపాయం లేదు. 3,500 స్కూళ్లలో అదనపు తరగతి గదులు, 300 పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. 11,206 స్కూళ్లకు కిచెన్ షెడ్లు లేవు. 3,181 స్కూళ్లకు విద్యుత్ కనెక్షన్లే లేవు. మరో 5 వేల స్కూళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
 
 24 లక్షల మందికి యూనిఫాంలు ఇవ్వలేదు..
 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈ ఏడాది ఉచిత యూని ఫాంలు ముందుగానే అందించడంలో విద్యా శాఖ విఫలమైంది. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు కుట్టించేందుకు క్లాత్ సరఫరా చేసే విషయంలో పక్కా చర్యలు చేపట్టలేకపోయింది. ఇపుడు విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించి ఇవ్వడం కాకుండా, డబ్బులు విద్యార్థులకే ఇస్తామని చివరి నిమిషంలో చేతులెత్తేసింది.
 
 ఇవీ పాఠశాలల పని వేళలు

► ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు. రోజుకు 7 గంటల 15 నిమిషాలు కొనసాగాలి.
► ప్రాథమికోన్నత పాఠశాలలు: ఆరు నుంచి 8వ తరగతి వరకు. ఉదయం 9:00  నుంచి సాయంత్రం 4:15 వరకు పని చేయాలి. రోజుకు 7 గంటల 15 నిమిషాలు పని చేయాలి.
► ప్రాథమిక పాఠ శాలలు, వాటిలోని అప్పర్ ప్రైమరీ సెక్షన్లు: రోజుకు 7 గంటలు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement