రైజింగ్ యూత్
స్టాస్... అంటే గ్రీకులో రైజ్ అగైన్ అని అర్థం. పేరుకు తగినట్టుగానే పునరుజ్జీవం చెందిందా యువత. ఫేస్‌బుక్ అంతా ఫేక్‌బుక్ అయిపోతోందని వాపోతున్న సమయంలో దానినే వేదికగా చేసుకుని సేవకు అంకితమయ్యారు. ముగ్గురు స్నేహితుల్లో వికసించిన ఆలోచన మూడు వేల మందికి విస్తరించింది. స్టాస్ ఫౌండేషన్‌గా రూపుదిద్దుకొని పదిహేడు జిల్లాల్లో సేవలందిస్తోంది.
- దార్ల వెంకటేశ్వరరావు, రాంగోపాల్‌పేట్
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కార్తీక్, కడప జిల్లాకు చెందిన మానస, మెదక్‌కు చెందిన నవీన్‌లు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయాన్ని ఉబుసుపోని కబుర్లకు పరిమితం చేయలేదు. సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్న ఆలోచనతో ఫేస్‌బుక్‌లో స్టాస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎప్పటికప్పుడు తమ సేవా కార్యక్రమాలను ఫేస్‌బుక్ ద్వారానే వివరిస్తూ వేల మందిని సభ్యులుగా చేశారు. అలా ముగ్గురుతో ప్రారంభమైన ఆ ఫౌండేషన్ ఇప్పుడు 300 మంది చురుకైన వలంటీర్లు, 3వేల మంది సభ్యులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 17 జిల్లాలకు విస్తరించింది.
అనాథలు, వృద్ధులకు కొత్త జీవితం
‘సుభిక్ష’ పేరుతో నిరుపేదలు, అనాథలు, రోడ్డు పక్కన ఉండే వారికి ఆహారం, దుస్తులు, దుప్పట్లు సమకూరుస్తున్నారు. పంక్షన్‌హాళ్లలో మిగిలిపోయిన అన్నం వృథా చేయకుండా, నిర్వాహకులను ఒప్పించి తెచ్చి పేదలకు పంచుతున్నారు. పాత దుస్తులు సేకరించి అవసరం ఉన్నవారికి అందిస్తున్నారు. రోడ్డుపై ఉన్న అనాథలను ఆశ్రమాల్లో చేర్పిస్తుంటారు.
నిరాదరణకు గురైన వృద్ధులకు, వికలాంగులకు తామున్నామనే భరోసా కల్పించే కార్యక్రమమే ‘ఆసరా’. తమ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనో, కాలేజీల్లోనో కాకుండా.. వృద్ధాశ్రమాల్లో జరుపుకొంటూ నిరాదరణకు గురైన వృద్ధులకు మేమున్నామనే భరోసా కలిగిస్తున్నారు. వారితో కొంత సమయం గడిపి బాధను దూరం చేస్తున్నారు.
చదువుల వెలుగులు
‘వెలుగు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందించి ఆదుకోవడం చేస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి, ప్రమాదాల్లో రక్తం అందక చనిపోవడాన్ని తగ్గించేందుకు ‘ఆయుష్’తో రక్తదానాలు చేసి ఆయువు పోస్తున్నారు. అలాగే అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు.
అనాథాశ్రమాల్లో తాము ఒంటరిమనే ఆత్మన్యూనతతో కాలం వెళ్లదీసే చిన్నారులను ‘విహార్’ పేరుతో విహారయాత్రలకు తీసుకుని వెళ్లి మానసిక ఆనందాన్ని పంచుతున్నారు. వారితో కలిసి ఆడిపాడి మానసిక ధైర్యాన్ని అందిస్తున్నారు. ‘ఉపాధి’ పేరుతో నిరుద్యోగులకు, వికలాంగులకు, బాలికలకు శిక్షణ అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం చేస్తుంది స్టాస్.
పర్యావరణ ‘ప్రాణధాత్రి’
పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ‘ప్రాణధాత్రి’ పేరుతో విస్తృతంగా మొక్కల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. రసాయన ఎరువుల వల్ల మనిషికి , భూమికి ఎదురయ్యే సమస్యల్ని ఇటు విద్యార్థులకు, అటు రైతులకు వివరిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
‘జాబిల్లి’ పేరుతో ఒక చిన్నారితో అనాథాశ్రమాన్ని మొదలు పెట్టింది స్టాస్. రోజుకు ఒక్కొక్కరు ఒక రూపాయి కూడబెట్టి అవసరమైతే ఇంకా వెచ్చించి, దాతల సహకారాన్ని తీసుకుంటూ ఈ బృహత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం.
ఏదైనా మంచి పని ఒక్కరే చేయాలని లేదు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కొంత సమాజహితానికి పాటుపడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’ అంటున్నారు స్టాస్ ప్రధాన కార్యదర్శి మానస. ‘సమాజ సేవ చేయాలనే తపన ఉండి, నెలకు రెండు రోజులు సమయం కేటాయించగలిగిన ప్రతి ఒక్కరు తమ ఫౌండేషన్‌లో చేరవచ్చు’ అని చెప్పారు స్టాస్ వ్యవస్థాపకుడు కార్తీక్.