కెమెరా ఉంటే కిర్రాకే!
రశ్మి... తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు. అందం, అభినయమే కాదు... చెరగని చిరునవ్వు, నాన్‌స్టాప్ మాటలు ఆమెకు స్పెషల్ ఎస్సెట్స్. అందుకే ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో సెటిలై... యావత్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఆ వసపిట్ట పాస్ట్ ఎక్స్‌పీరియెన్సెస్, ఫ్యూచర్ ప్లాన్స్ ఆమె మాటల్లో...
..:: శిరీష చల్లపల్లి
నాన్నది ఉత్తరప్రదేశ్.. అమ్మది ఒడిశా. నేను హైదరాబాదీనీ. పుట్టింది ఒడిశాలో అయినా నేను పెరిగింది వైజాగ్‌లో. చదువంతా అక్కడే. స్కూల్‌డేస్ నుంచే నాకు ధైర్యం ఎక్కువ. స్టేజ్ ఫియర్ అస్సలు ఉండేది కాదు. వెయ్యి మందిలో అయినా అవలీలగా మాట్లాడగలిగేదాన్ని. ఇంకా ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ వాలిపోయేదాన్ని. డాన్సు చేయడం బాగా ఇష్టం. ఫ్రెండ్స్ బర్త్‌డేస్‌లో హంగామా అంతా నాదే. పిలిపించుకుని మరీ నాతో డాన్స్ చేయించుకునేవారు. ఓన్లీ డాటర్‌ని కావడంతో అమ్మా, నాన్న కూడా నాకు అడ్డు చెప్పేవారు కాదు. అలా గారాబంగా పెరిగాను.
ప్రజలకు దగ్గరగా...
హైదరాబాద్‌కు వచ్చి పది సంవత్సరాలవుతోంది. 2006లో మొదటిసారి ‘ప్లీజ్ సారీ థ్యాంక్స్’ అనే తెలుగు సినిమాలో నటించాను. నాగార్జున గారు నిర్మించిన ‘యువ’ సీరియల్‌లో కూడా చేశాను. అలా సినిమాలు, సీరియల్స్, ప్రోగ్సామ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. గతంలో ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. స్కోప్ ఎక్కువగా ఉంది. అందుకే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాను.
ఫిట్‌నెస్ సీక్రెట్...
ఇక నా హాబీస్ విషయానికొస్తే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నా ఫిట్‌నెస్‌కి కారణం కూడా అదే. నాకు జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌లో ‘కూచిపూడి సముద్రం తాళి’ అంటే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ బాగా తింటాను. వంటలు చేయడంలో ఎక్స్‌పర్ట్ కాదుగానీ... అప్పుడప్పుడు ఎక్స్‌పరిమెంట్స్ చేస్తూ ఉంటాను.
‘వ్యూహం’తో...
నేను డిఫికల్ట్ పర్సన్‌ని. ఎదుటివారి ప్రవర్తనను బట్టే నా బిహేవియర్ ఉంటుంది. ఎక్కువగా ఎవరితోనూ క్లోజ్ అవ్వను. అలా అని ఫ్రెండ్స్ లేరని కాదు. ఉన్నారు... కానీ అంత క్లోజ్ కాదు. అందుకే అందరూ నన్ను హైపర్ యాక్టివ్ అంటారు. అంత ఈజీగా అలసిపోను. అదే నా ప్లస్ పాయింట్. ప్రస్తుతం ‘వ్యూహం’ సినిమాలో చేస్తున్నాను. అది త్వరలో రిలీజ్ కాబోతోంది. నా ప్రోగ్రామ్స్‌ని ఆదరిస్తున్నట్టే సినిమాలో నా పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నా.