
ఆర్కే మా కస్టడీలో లేరు
మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తమ కస్టడీలో లేరని ఏపీ పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్(
- కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా లేదు
- హైకోర్టుకు నివేదించిన ఏపీ పోలీసులు
- పోలీసుల అదుపులోనే ఉన్నారనేందుకు ఆధారాలున్నాయి
- పిటిషనర్ తరఫు న్యాయవాది స్పష్టీకరణ
- ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువిచ్చిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తమ కస్టడీలో లేరని ఏపీ పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం హైకోర్టుకు నివేదించారు. ఎన్‌కౌంటర్‌పై ఒడిశాలో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని, అందువల్ల ఆర్కేను తాము అదుపులోకి తీసుకునే అవకాశం కూడా లేదని తెలిపారు. ఈ వాదనలను పిటిషనర్ అయిన ఆర్కే సతీమణి శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తోసిపుచ్చారు. తమకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్కే ఏపీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారని నొక్కి చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారని చెప్పేందుకు నిర్దిష్టమైన ఆధారాలను కోర్టు ముందుంచాలని రఘునాథ్‌కు తేల్చి చెప్పింది.
ఆ ఆధారాలు విశ్వసనీయంగా ఉంటే తాము తప్పక విచారణకు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రఘునాథ్ కోర్టు హాలులోనే ఉన్న విరసం నేత వరవరరావును సంప్రదించారు. తప్పకుండా ఆధారాలు సమర్పిస్తామని, అందుకు పది రోజుల గడువు కావాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆధారాల సమర్పణకు రెండు వారాల గడువునిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉభయులూ పారదర్శకంగా వ్యవహరించాలి
ఈ మొత్తం ఘటనతో ఏపీ పోలీసులకు సంబంధం లేదంటారా? అని అడ్వొకేట్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తాను అలా అనడం లేదని, ఏపీ, ఒడిశా పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయని, అందువల్ల ఏపీ పోలీసులకు సంబంధం లేదని చెప్పడం లేదన్నారు. ఆర్కేను ఏపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం లేదంటారా? అని ధర్మాసనం తిరిగి ఏజీని ప్రశ్నించింది. అవునన్న ఏజీ, ఆర్కే పలు కేసుల్లో నిందితునిగా ఉన్నారని, తాము అతడిని అరెస్ట్ చేస్తే తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ‘‘ఇంత పెద్ద ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు భయాందోళనలు సహజం. ఇలాంటి సమయంలోనే ఉభయులూ పారదర్శకంగా వ్యవహరించాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఒక్క పేజీ.. ఒక్క పేరాతో కౌంటర్
తన భర్త ఆర్కేను ఏపీ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు విశాఖ రూరల్ ఎస్‌పీ రాహుల్‌దేవ్ శర్మ గురువారం కేవలం ఓ పేరా.. ఓ పేజీ కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ... పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ నామమాత్రంగా ఉందని తెలిపారు.
అక్రమ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, అందువల్ల దీనిపై విచారణ జరిపేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశించాలని కోరారు. ఇంతకీ మీరు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘మీరు ముందు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వద్దకు వెళ్లండి. ఆ తరువాత కావాలంటే మా వద్దకు రండి. అప్పుడు మేం తప్పకుండా విచారణ జరపాలని కమిషన్‌ను ఆదేశిస్తాం’’ అని స్పష్టం చేసింది. ఇంతటితో ఈ వ్యాజ్యంపై ముగించమంటారా? అని అడిగింది. వద్దని, పెండింగ్‌లోనే ఉంచాలని రఘునాథ్ కోరారు.