విద్యుత్‌కు నిధుల కోత | Rs. 3,241.89 crore has been allocated to power sector | Sakshi
Sakshi News home page

విద్యుత్‌కు నిధుల కోత

Published Thu, Nov 6 2014 2:14 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

విద్యుత్‌కు నిధుల కోత - Sakshi

విద్యుత్‌కు నిధుల కోత

* టీజెన్‌కోలో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఆశలు
*సోలార్ పంప్‌సెట్లకు రూ. 200 కోట్లు
*రూఫ్ టాప్ సోలార్ పవర్‌కు రూ. 40 కోట్లు
* ఐదేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామన్న మంత్రి ఈటెల

 
 అవసరం రూ. 6,000 కోట్లు.. ఇచ్చింది రూ. 3,000 కోట్లు

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొరతను అధిగమించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. ఈ రంగానికి మాత్రం నిధుల్లో భారీగా కోత విధించింది. విద్యుత్ రాయితీల కోటాను ఏకంగా సగం కత్తిరించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయం కింద విద్యుత్ రంగానికి రూ. 3,241.89 కోట్లు కేటాయించింది. విద్యుత్ సబ్సిడీ రూ. 3,000 కోట్లు కూడా అందులో భాగమేనని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.

వాస్తవానికి ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా విద్యుత్ రాయితీలకు ఈ ఏడాది రూ. 5,630 కోట్లు అవసరమని ట్రాన్స్‌కో అంచనా వేసింది. కొరత కారణంగా మరింత విద్యుత్ కొనుగోలు చేయక తప్పని పరిస్థితులున్నాయి. ఈ లెక్కన మొత్తం రూ. 6,000 కోట్ల వరకూ అవసరం. వ్యవసాయం, మరమగ్గాలు, గృహ వినియోగదారులతో పాటు పలు పరిశ్రమలకు రాయితీలు అమల్లో ఉన్నాయి. ఈ రాయితీల వాటాలో సగానికి సగం నిధులకు కోతపడటంతో ఈ కేటాయింపులు ఏ మూలకూ సరిపోవని... ఉచిత విద్యుత్ అందుకుంటున్న రైతులు, వంద యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు టీఎస్‌జెన్‌కోలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించటం ఆశావహ పరిణామం. దీంతో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పుంజుకోవటంతో పాటు.. తమవంతు వాటాగా రాష్ట్ర ప్రభుత్వానికి లాభాలు వచ్చే అవకాశముంది. ఇక విద్యుత్ కొరతను అధిగమించే కసరత్తులో భాగంగా రైతులకు సౌర విద్యుత్ పంప్‌సెట్లను అందించేందుకు రూ. 200 కోట్లు కేటాయించారు. దీంతోపాటు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 40 కోట్లు కేటాయించారు. మొత్తంగా విద్యుత్ రంగానికి ప్రణాళికేతర పద్దులో రూ. 3,241.89 కోట్లు.. ప్రణాళిక పద్దులో రూ. 1,636.78 కోట్లుగా ప్రతిపాదించారు. విద్యుత్ ప్రాజెక్టులకు రూ. 374.05 కోట్ల రుణాలను సమీకరించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement