సాక్షి,సిటీబ్యూరో: బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన ఓ వాహనదారుడు ఖైరతాబాద్ కేంద్ర రవాణా కార్యాలయంలో గతేడాది డిసెంబర్ 13న తన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తు పూర్తి చేసిన ఆయన ఫీజు చెల్లించి, సెల్ఫ్‌అడ్రస్ కవర్‌తో పాటు అధికారులకు సమర్పించాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైదని, వారం రోజుల్లో స్మార్ట్ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుందని అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటికి 10 నెలలైనా ఇప్పటి వరకు కార్డు అందలేదు. ఈ పది నెలల్లో కనీసం 20 సార్లు అయన ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
అధికారులు సమస్య ను పరిష్కరించకపోగా.. వెళ్లిన ప్రతీసారి కార్డు ఇంటికే వస్తుందని చెప్పి అతడ్ని పంపేశారు. ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ కార్డు) లేకుండా వాహనం నడపడంతో పలుసార్లు ఆయన ట్రాఫిక్ పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది. సదరు వాహనదారుడు నాలుగు రోజుల క్రితం మళ్లీ అధికారులను సంప్రదించ గా.. ‘ఆర్టీఏ అధికారులు పంపించిన (అసలు పంపకుండానే) ఆర్‌సీ ఎక్కడో పోగొట్టుకున్నట్లుగా దరఖాస్తు చేసుకొంటే డూప్లికేట్ ఆర్‌సీ ఇస్తామంటూ’ చావుకబురు చల్లగా చెప్పారు.
వాహనం రిజిస్ట్రేషన్ కోసం మొత్తం ఫీజు, రూ.25 పోస్టల్ చార్జీ చెల్లించిన వాహనదారుడికి రవాణాశాఖ అందజేసిన పౌరసేవ ఇది. ఒక్క ఎన్బీటీనగర్ వాహనదారుడి సమస్య మాత్రమే కాదు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి మాత్రమే ఇది పరిమితం కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని రవాణా కార్యాలయాల్లో జరుగుతున్న ‘స్మార్ట్’ దోపిడీ ఇది. వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులను, డ్రైవింగ్ లెసైన్స్‌లను పోస్టు ద్వారా పంపించినట్లు చెబుతున్నప్పటికీ వాటిని తిరిగి దళారులకే అప్పగిస్తున్నారు.
దళారులకు, ఆర్టీఏ సిబ్బందికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో కార్డుపై రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పోస్టులో కార్డు వస్తుందని ఎదురు చూసే వినియోగదారులకు మాత్రం ఎన్బీటీనగర్ వాహనదారుడికి జరిగిన అనుభవమే ఎదురవుతోంది. అప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌లకు దళారుల చేతి వాటానికి జేబులు గుల్ల చేసుకుంటున్న వాహనదారులు.. స్మార్ట్‌కార్డు కోసం మరోసారి ఇలా కాసులు చెల్లించక తప్పడం లేదు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం...
రవాణాశాఖ పౌరసేవల నిర్వహణలో కీలక విధులు నిర్వహించే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని రవాణా కార్యాలయాలపై ఉన్నతాధికారుల నిఘా, పర్యవేక్షణ లేకపోవడం, కేవలం ప్రధాన కార్యాలయానికే పరిమితం కావడంతో ఇ క్కడి సిబ్బంది ప్రతీ పనికి లంచం తీసుకుంటున్నారు. పాతబస్తీ బహదూర్‌పురా వంటి కార్యాలయాల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ వ్యాపారంలా మారిందని, డబ్బులు చెల్లిస్తే తప్ప కార్డు చేతికి అందడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నతాధికారులు బహిరంగంగానే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్టీఏలో ‘స్మార్ట్’ దోపిడీ
Published Mon, Sep 30 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement