సమ్మె పాట్లు.. దోపిడీ | RTC strike | Sakshi
Sakshi News home page

సమ్మె పాట్లు.. దోపిడీ

Published Thu, May 7 2015 2:17 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

సమ్మె  పాట్లు.. దోపిడీ - Sakshi

సమ్మె పాట్లు.. దోపిడీ

{పైవేట్ వాహనాలు, ఆటోల ఇష్టారాజ్యం
డిపోలకే పరిమితమైన 3800 బస్సులు
కార్మికుల ధర్నాలు, ఆందోళనలతో అట్టుడికిన డిపోలు
 

ఆర్టీసీ సమ్మె... బుధవారం సిటీలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికులు, ఉద్యోగులు, చిరు  వ్యాపారులు ఇక్కట్ల పాలయ్యారు. ప్రైవేటు వాహనదారులు, ఆటోడ్రైవర్లు ప్రయాణికుల అవసరాలను ‘క్యాష్’  చేసుకున్నారు. ఇష్టారీతిలో చార్జీలు పెంచేసి నిలువు దోపిడీకి పాల్పడ్డారు. ప్రధాన బస్‌స్టేషన్లలో దూర  ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోజంతా పడిగాపులు కాశారు. సమ్మె విషయం తెలియక బస్టాండ్లకు వచ్చి నిరాశగా తిరుగుముఖం పట్టారు. మరోవైపు ఎంఎంటీఎస్, సెట్విన్ బస్సులు  కిక్కిరిసినడిచాయి. గ్రేటర్‌పరిధిలోని 28 డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.   కండక్టర్‌లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, క్లరికల్ సిబ్బంది సహా 20 వేల మందికి పైగా  సమ్మెలో  పాల్గొన్నారు. దాదాపు 3800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.- సాక్షి, సిటీబ్యూరో
 
సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మొదటి రోజు బుధవారం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అన్ని డిపోలు, రీజనల్ కార్యాలయాలు, ప్రధాన బస్‌స్టేషన్‌ల వద్ద  కార్మికులు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ  యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని, న్యాయమైన కోర్కెలను సాధించుకొనే వరకు సమ్మె కొనసాగుతుందని ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ నాయకులు ప్రకటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్టీసీ చేపట్టిన చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో  70 బస్సులను నడుపగలిగినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. మరోవైపు  తాత్కాలిక సిబ్బంది బస్సులు బయటకు తీయకుండా పలు చోట్ల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్‌లు అడ్డుకున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్,రాణీగంజ్, మెహదీపట్నం,రాజేంద్రనగర్, మియాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, పటాన్‌చెరు, బండ్లగూడ, చెంగిచెర్ల, ఫలక్‌నుమా,కుషాయిగూడ,మేడ్చెల్,  తదితర డిపోలలో  యాజమాన్యం చర్యలను నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అధికారులు బస్సులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
 
నిలువుదోపిడీ...

కార్మికుల సమ్మె నేపథ్యంలో  మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, రెతిఫైల్ తదితర బస్‌స్టేషన్‌లు, ఆర్టీసీ ప్రాంగణాలు బోసిపోయాయి. ప్రతి రోజు 3500 బస్సుల రాకపోకలతో, లక్ష మంది ప్రయాణికులతో  కళకళలాడే ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్‌లు వెలవెలబోయాయి.  సమ్మె పట్ల అవగాహన లేని దూరప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రైవేట్ బస్సులు, కార్లను ఆశ్రయించారు. సమ్మె దెబ్బతో ఆపరేటర్లు చార్జీలను అమాంతంగా రెట్టింపు చేశారు. నగరంలోనూ  ప్రయాణికులు ఆటోవాలాల  నిలువుదోపిడీకి గురయ్యారు. మీటర్‌లతో నిమిత్తం లేకుండా డబ్బులు డిమాండ్ చేశారు. సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్ తదితర వాహనాలు సైతం దోపిడీ పర్వాన్ని కొనసాగించాయి. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ నుంచి  ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు  ఆటో చార్జీ రూ.50 ఉంటే  బుధవారం దాన్ని రూ.100 నుంచి రూ.125 కు పెంచేశారు. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు రూ.40 లోపే ఉంటుంది. కానీ ఆటోవాలాలు రూ.100కు పెంచారు. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. సాధారణ రోజుల్లో శివార్లకే పరిమితమయ్యే సెవెన్ సీటర్ ఆటోలు నగరం లోపలికి ప్రవేశించాయి. ఉప్పల్ నుంచి  సికింద్రాబాద్ వరకు సెవెన్ సీటర్ చార్జీ మామూలుగా అయితే రూ.15 లోపే ఉంటుంది. కానీ బుధవారం  రూ.30 నుంచి రూ.40 కి చేరుకుంది.
 
కిక్కిరిసిన ఎంఎంటీఎస్ రైళ్లు

బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయించారు. దీంతో అన్ని వైపులా ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిసి తిరిగాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వైపు, నాంపల్లి నుంచి హైటెక్‌సిటీ వైపు ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా కనిపించింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని  ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజీలుగా  పర్మిట్లు ఇచ్చారు. స్కూళ్లు, కాలేజీ బస్సులు,ఇతర వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అనుమతినిచ్చారు. అయినప్పటికీ  ప్రయాణికుల రద్దీకి అనుగుణమైన రవాణా సదుపాయాలు లభించలేదు.

కాంట్రాక్ట్ పద్ధతిలో చేరి విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్‌లు గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఈడీ జయరావు ఒక ప్రకటనలో కోరారు. విధులకు హాజరు కాని పక్షంలో సర్వీసుల నుంచి తొలగిస్తామన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement