సాగర్ ప్రక్షాళనకు విరామం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డులోని హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రస్తుతానికి నిలిచిపోయినట్లే. సాగర్ ప్రక్షాళన కోసం అధికారులు గత మార్చి నుంచి నీటిని ఖాళీ చేసే చర్యలు ప్రారంభించారు. దాంతో 512.9 మీ. లెవెల్ ఉన్న సాగర్ రిజర్వాయర్ మే నెలాఖరు నాటికి 512 మీటర్ల లెవెల్ వరకు తగ్గిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగర్‌నీటి మట్టం తిరిగి 512.7 మీటర్ల వరకు చేరింది. అంటే దాదాపుగా యథావిధి స్థాయికి చేరింది.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్‌టీఎల్) 513.41 మీటర్లు. వర్షాలు కురస్తుండటంతో ఈ ఏడు ప్రక్షాళన పనుల్ని అధికారులు నిలిపివేసినట్లే. ఎప్పటిలాగే వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తూములకు మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారు. వర్షాల్లేని రోజుల్లోనే ఆ పనుల్ని చేస్తూ ఉన్నారు. సాగర్ నుంచి నీటిని అవసరాన్ని బట్టి విడుదల చేసేందుకు రూ.1.02 కోట్లతో అలుగు దిగువభాగం నుంచి నీరు వెళ్లేందుకు అవసరమైన పైప్‌లైన్ పనులు ప్రారంభించారు.
ఈ పనులు పూర్తయితే అలుగు కంటే తక్కువ ఎత్తులో నీరున్నా దిగువకు వదలడానికి వీలవుతుంది. రానున్న సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సాగర్‌లోనే ఈ నిమజ్జనాలు పూర్తయ్యాక, వచ్చే నవంబర్- డిసెంబర్‌లలో తిరిగి సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టి వచ్చే ఏడాది వేసవిలో సాగర్‌ను ఖాళీ చేయాలనేది అధికారుల యోచనగా తెలుస్తోంది.
సీఎం ఆదేశాలతో..: వేసవిలో సాగర్‌లో నీటినంతా ఖాళీ చేసి అడుగున ఉన్న చెత్తాచెదారాల్ని తొలగించాలని నిరుడు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సాగర్ చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను సీఎం పరిశీలించి వాటిలో అద్భుతమైన టవర్స్‌ను నిర్మించవచ్చని చెప్పారు. గణేశ్, బతుకమ్మల నిమజ్జనాలకు ఇందిరాపార్కులో వినాయకసాగర్ పేరిట రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినప్పటికీ, బీజేపీ తదితర పక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ప్రక్షాళనకు రూ. 350 కోట్లు..
సాగర్ ప్రక్షాళనపై అధ్యయనం కోసం దాదాపు రూ. కోటి ఖర్చు కాగలదని అంచనా వేసిన ఆస్ట్రియా ప్రభుత్వం.. రూ. 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వె చ్చిస్తే మిగతా రూ. 80 లక్షల ఆర్థికసాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అధ్యయనం అనంతరం సాగర్ ప్రక్షాళనకు మొత్తం రూ. 350 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందులో 80 శాతం నిధుల్ని ఆస్ట్రియా ప్రభుత్వమే అక్కడి ఆర్థికసంస్థల ద్వారా ఇప్పిం చేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ అంశంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.