పుష్కరాల దృష్ట్యా సాగర్‌కు 10 టీఎంసీలు
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు కృష్ణా బోర్డు అంగీకారం
తదుపరి ఆదేశాల వరకు నీటిని వాడొద్దని తెలంగాణ, ఏపీకి సూచన
ఏపీలో తాగునీటి కోసం హంద్రీనీవాకు 4.5 టీఎంసీలు కేటాయింపు
22.7 టీఎంసీల విడుదలకు బోర్డును కోరిన తెలంగాణ
ఏపీ నీటి మళ్లింపుపై దృష్టి పెట్టాలని లేఖ
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విజ్ఞప్తికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. అయితే ఆ నీటిని నిల్వ చేసి పెట్టాలని, తదుపరి ఆదేశాల వరకు నీటిని వినియోగించరాదని సూచించింది. రాష్ట్రాల అవసరాల మేరకు ఈ నీటి విడుదలపై ఇరు రాష్ట్రాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. మరోవైపు కర్నూలు, అనంతపురం తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే హంద్రీనీవా ద్వారా 0.5 టీఎంసీల నీటిని వాడుకున్నందున మిగతా 4.5 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఏపీకి అనుమతిచ్చింది. బుధవారం నుంచి వచ్చే నెల 9 వరకు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ఏపీకి సూచించింది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) ద్వారా తెలంగాణ యథావిధిగా 525 క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవచ్చని తెలిపింది.
22.7 టీఎంసీలు కావాలి...
శ్రీశైలం నుంచి సాగర్‌కు 22.7 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే బోర్డును కోరుతూ లేఖ రాసింది. సాగర్‌లో ఇప్పటికీ కనీస నీటిమట్టానికి (510 అడుగులు) దిగువన 505 అడుగుల వద్ద నీటి లభ్యత ఉందని, హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపులు బిగించి నీటిని తీసుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలానికి వరద చేరుతున్న దృష్ట్యా సాగర్‌కు నీరు విడుదల చేయాలని కోరింది. సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులు చేరేందుకు వీలుగా 6.70 టీఎంసీలు, సాగర్ కుడి, ఎడమ కాల్వ కింద అవసరాల కోసం ఏపీకి, తమకు చెరో 5 టీఎంసీల చొప్పున 10 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం ఏఎంఆర్‌పీ ద్వారా మరో 6 టీఎంసీలు కేటాయించాలని విన్నవించింది. ఈ నీటితో రాష్ట్ర తాగు అవసరాలతోపాటు పుష్కరాలకు నీటి కొరత తీరుతుందని విన్నవించింది. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాల కోసం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలిస్తున్న నీటిపై దృష్టి పెట్టాలని బోర్డుకు రాష్ట్రం సూచించింది. ఏపీ ఏ మేరకు నీటిని వాడుకుంటోందనే అంశంపై దృష్టి పెట్టి వాటా మేరకే వాడుకునేలా చూడాలని విన్నవించింది.