ర్యాలీలు, మానవహారాలు
ఏపీలో ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై పెల్లుబికిన ప్రజాగ్రహం
సాక్షి నెట్‌వర్క్: నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వాస్తవాలను ప్రతిబింబిస్తున్న తెలుగువారి మనస్సాక్షి.. సాక్షి టీవీ చానల్ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు అన్యాయంగా నిలిపివేయడంపై ఆగ్రహం ఉధృతమైంది. ఆరో రోజైన మంగళవారం జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించారు. ధర్నాలు, మానవహారాలు చేపట్టారు.
హైదరాబాద్‌లో నేడు జర్నలిస్టుల ర్యాలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా హైదరాబాద్‌లో జర్నలిస్టులు బుధవారం ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లి సాక్షి ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తారు.