
ప్రేమ ఒక అనుభూతి. పెళ్లి ఒక అనుబంధం. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌లో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొనేవాళ్లు ఉన్నారు. పెళ్లి తరువాతే ప్రేమంటూ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్లూ ఉన్నారు. ఎవరైనా కోరుకొనేది ఒక్కటే...ఆ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలి. ప్రేమ పరమార్థం పెళ్లి కావాలి. ప్రేమ పెళ్లిళ్లపై యువత ఏమనుకుంటున్నారు? పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లపై వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశం ఎప్పుడైనా ఆసక్తిదాయకమే. చర్చనీయాంశమే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇదే అంశంపై ‘సాక్షి’ ఒక సర్వే నిర్వహించింది. విదేశీ యువతీ యువకులు, హైదరాబాద్ యువత మనోగతాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించింది. ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని 70 శాతం మంది విదేశీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం 85 శాతం మంది పెళ్లి తరువాతే ప్రేమకు జై కొట్టారు. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని రెండు వర్గాల విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు.
యువత మనోగతం ఇదే...
సాక్షి నెట్‌వర్క్: ప్రేమ, పెళ్లి అంశంపై అభిప్రాయ సేకరణ చేపట్టగా...నగరంలోని బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలకు చెందిన హైదరాబాద్ యువతీ యువకులు, తార్నాక ఇఫ్లూ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. ఏ బంధమైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని ఇరువర్గాల విద్యార్థులు గట్టిగా చెప్పారు. ప్రేమించుకున్నాకే పెళ్లి చేసుకోవాలని 70 శాతం మంది విదేశీ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొని లోపాలను సరిదిద్దుకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం 85 శాతం మంది పెళ్లి తరువాతే ప్రేమకు జై కొట్టారు. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని రెండు వర్గాల విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అలాగే ప్రేమిస్తే కచ్చితంగా పెళ్లి వరకూ వెళ్లాల్సిందేనని 85 శాతం మంది హైదరాబాద్ విద్యార్థులు కుండబద్దలు కొట్టి చెప్పారు. విదేశీ విద్యార్థుల్లో 25 శాతం మాత్రం అభిప్రాయబేధాలు ఉంటే పెళ్లి చేసుకోవడం కంటే దూరం కావడమే మంచిదని స్పష్టం చేశారు.
సర్వే ఇలా....
1) ప్రేమ తర్వాత పెళ్లి....పెళ్లి తర్వాత ప్రేమ...ఏది కరెక్ట్?
ఎ) ప్రేమ తర్వాత పెళ్లి – హైదరాబాద్ విద్యార్థులు : 35 శాతం, విదేశీ విద్యార్థులు : 70 శాతం
బి) పెళ్లి తర్వాత ప్రేమ – హైదరాబాద్ విద్యార్థులు : 65 శాతం విదేశీ విద్యార్థులు : 30 శాతం
2) మీ దృష్టిలో ప్రేమంటే?
ఎ) ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం – రెండు కేటగిరీల విద్యార్థులు: 80 శాతం
బి) ఒకరి అవసరాలు ఒకరు తీర్చడం – రెండు కేటగిరీల విద్యార్థులు: 20 శాతం
3) ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి వరకు వెళ్లాల్సిందేనా..?
ఎ) అవును – హైదరాబాద్ స్టూడెంట్స్ – 85 శాతం. విదేశీ విద్యార్థులు: 75 శాతం
బి) లేదు– హైదరాబాద్ స్టూడెంట్స్ – 15 శాతం విదేశీ విద్యార్థులు: 25 శాతం
4) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమేనా?
ఎ) కాదు– రెండు కేటగరీల విద్యార్థులు: 80 శాతం
బి) అవును – రెండు కేటగరీల విద్యార్థులు: 20 శాతం
5) మీ ఓటు లవ్ మ్యారేజ్‌కా లేక అరేంజ్‌డ్ మ్యారెజ్‌కా....?
ఎ) లవ్ మ్యారేజ్ – హైదరాబాద్ స్టూడెంట్స్ 35 శాతం, విదేశీ స్టూడెంట్స్ 70 శాతం
బి) అరేంజ్‌డ్ – హైదరాబాద్ స్టూడెంట్స్ 65 శాతం, విదేశీ విద్యార్థులు 30 శాతం
అది ఒక ఆకర్షణ మాత్రమే....
ఇక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది చాలా వరకు ఆకర్షణ మాత్రమేని హైదరాబాద్ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కొట్టిపడేశారు. తొలిచూపులోనే ప్రేమ చిగురిస్తుందనే దానికి కేవలం 20 శాతం మంది సానుకూలత వ్యక్తం చేయగా, 80 శాతం మంది మాత్రం అది సరైంది కాదన్నారు. ఒకరునొకరు స్పష్టంగా తెలుసుకొని, అభిప్రాయాలను,ఆలోచనలను పంచుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పారు.
పెద్దలు కుదిర్చితే ఓకే....
పెద్దలు కుదిర్చిన పెళ్లికి 65 శాతం మొగ్గు చూపారు. మిగతా 35 శాతం మాత్రం ప్రేమ పెళ్లి పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.పెద్దలు కుదుర్చిన వివాహ వ్యవస్థలో భద్రత ఉంటుందని, కుటుంబం అండదండలు ఉంటాయని కొందరు అభిప్రాయపడగా, అలా అని చెప్పి గుడ్డిగా ఒప్పేసుకోలేమని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నమ్మకం ముఖ్యం
ప్రేమించి చేసుకున్నా..లేకపోయినా సరే కాని పెళ్లి తర్వాత ఒకరిని ఒకరు గౌరవించుకోవలి. ప్రేమించుకోవాలి. ఒకరిపై ఒకరు పరస్పర నమ్మకం ఉంచాలి. నేను పెద్దలు కుదిర్చిన వివాహానికే మొగ్గు చూపుతాను. – గిరిష్మా పట్నాయక్, విద్యార్థిని
జీవితాంతం ప్రేమించుకోవాలి
ప్రేమించి చేసుకోవడమా లేదా పెళ్లి తర్వాత ప్రేమించడమా అన్నది పెద్ద సమస్య కాదు. ఎలా చేసుకున్నా జీవితకాలం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ప్రధానం. లేకుంటే వివాహానికి అర్థం లేదు.
– హిమజ, విద్యార్థిని
ప్రేమ తర్వాతే పెళ్లి...
ప్రేమ తర్వాతే పెళ్లికి నేను ఓటేస్తాను. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, అభిప్రాయాలను గౌరవించుకోవడం ముఖ్యం . అదే పెళ్లిని కలకాలం నిలుపుతుంది. నిజమైన ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.–భవ్య, విద్యార్థిని
లవ్ ఫస్ట్....
ప్రేమించిన తరువాత పెళ్లి చేసుకోవడమనేది సరైంది. ఇద్దరి మ«ధ్య చిగురించిన ప్రేమ ఆకర్షణగా మొదలై ఆ తరువాత ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు వెళుతుంది. జీవితాంతం తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉండాలి కాబట్టి ఇద్దరూ తన అభిప్రాయాలను తెలుసుకుంటారు.– ఒసామా, ఎల్‌ఎల్‌ఎం(ఇరాక్)
చివరి వరకు నిలిచేది ప్రేమ...
ప్రేమంటే రెండు జీవితాలు ప్రాణమున్నంత వరకు కలిసి ఉండేది. ఒకరినొకరు పూర్తిగా అర్దం చేసుకోవాలి. అపుడే వారి మధ్య నిజమైన బంధంఏర్పడుతుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా తనకు నచ్చిన వ్యక్తిని గిఫ్టుల ద్వారా ఆకట్టుకోవడం కాదు, వారికి జీవితాంతం తోడునీడగా ఉండాలి.–నసీబా, బీసీ ఓయూ (అఫ్టనిస్తాన్)
నో లవ్... నో మ్యారేజ్...ఓన్లీ సింగిల్...
ప్రేమలు, పెళ్లిళ్లు అనేది పెద్ద బోగస్...వాలెంటైన్స్ డే పేరుతో ప్రేమికులు తమప్రేను వ్యక్తపర్చడమనేది కేవలం ఒక ఆకర్షణ మాత్రమే. నాకు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు అసలే నచ్చవు. వీటికి నేను దూరం.. నో వాలెంటైన్స్ డే...నో లవ్... నో మ్యారేజ్.. అయామ్ ఓన్లీ సింగిల్... – ఎలీనా, పీహెచ్‌డీ (సిరియా)
మా దేశంలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ
మా దేశంలో చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తారు. వాలెంటైన్స్ డే సందర్బంగా చాలా మందిప్రేమికులు తమ ప్రేమను వెలిబుచ్చి ఆమోదం పొందుతారు. పెళ్లికి ముందు ప్రేమ వల్ల ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. దీంతో ఇరువురి మధ్య ఒక నమ్మకం కుదురి గొప్ప బంధం ఏర్పడుతుంది. –మరియం, ఎంసీజే (మొరాకో)
Comments
Please login to add a commentAdd a comment