తొలగించిన కాలానికీ జీతం చెల్లించాలి
- ఆర్టీసీ ఉద్యోగి తొలగింపు కేసులో హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తొలగించిన ఉద్యోగులపై ఆరోపణలు నిరూపణ కానప్పుడు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. తొలగించిన కాలానికి జీతం కూడా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పిం ది. ఆర్టీసీ ఉద్యోగి తొలగింపునకు సంబంధించిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉద్యోగుల తొలగింపు కేసుల్ని కింది కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వారిని ఆర్టీసి తిరిగి విధుల్లోకి తీసుకున్నా, తొలగింపు కాలానికి జీతం, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలని న్యాయ మూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి ప్రస్తుతించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అమీనాపూర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.నర్సయ్య హన్మ కొండ–నిజామాబాద్ రూట్‌లో బస్సు నడుపుతుండగా ట్రాక్టర్‌ను ఢీకొంది. 2005 జనవరి 30 జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సును నడిపారన్న ఆరోపణలపై తొలుత సస్పెన్షన్, అదే ఏడాది సెప్టెంబర్ 2న సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆర్టీసీ చర్యలు తీసుకుంది. నర్సయ్యపై క్రిమినల్ కేసును 2009 జూలైలో కామారెడ్డి కోర్టు కొట్టేసింది.
అదే సమయంలో నర్సయ్య హైదరాబాద్ లేబర్ కోర్టు–2ను ఆశ్రయించగా... ఆర్టీసీ ఆరోపణల్ని కొట్టివేస్తూనే, పనిచేయని కాలానికి జీతం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2011 ఫిబ్రవరిలో తిరిగి విధుల్లోకి చేరిన నర్సయ్య హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఆరోపణల్ని కామారెడ్డి కోర్టు కొట్టేసిందని, కనుక పనిచేయని కాలానికి జీతం తోపాటు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చేలా ఆదేశా లివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదిం చారు. తొలగించిన కాలానికి జీతం, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆర్టీసీని ఆదేశించారు.